అరటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
బుక్కరాయసముద్రం: గిట్టుబాటు ధర లేక జిల్లా అరటి రైతులు రూ.700 కోట్ల మేర పెట్టుబడులు నష్టపోతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి.రాంభూపాల్ పేర్కొన్నారు. అరటి పంటను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం రెడ్డిపల్లిలోని అరటి తోటలను ఆయన పరిశీలించి, మాట్లాడారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ నల్లప్ప, రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు శివారెడ్డి, శ్రీనివాసులు, నాగేంద్ర, రైతులు పాల్గొన్నారు.
1న అప్రెంటిస్‌షిప్ దరఖాస్తుదారుల సర్టిఫికెట్ల పరిశీలన
అనంతపురం క్రైం: ఏపీఎస్ ఆర్టీసీలో అప్రెంటిస్ షిప్ కోసం దరఖాస్తు చేసుకున్న ఐటీఐ అభ్యర్థుల సర్టిఫికెట్లను డిసెంబర్ 1న కర్నూలులోని ఆర్టీసీ జోనల్ శిక్షణ కళాశాలలో పరిశీలించనున్నారు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ నజీర్ అహమ్మద్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 9 గంటలకు హాజరు కావాలి. పూర్తి వివరాలకు 08518–257025 లో సంప్రదించవచ్చు.
యువకుడి ఆత్మహత్య
కళ్యాణదుర్గం రూరల్: ఉద్యోగ అవకాశాలు దక్కకపోవడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బ్రహ్మసముద్రం మండలం ఎనకల్లు గ్రామానికి చెందిన వెంకటేశులు, వరలక్ష్మి దంపతుల ఏకై క కుమారుడు బోయ ఆనంద్(21) డిగ్రీ వరకు చదువుకుని, రెండేళ్లుగా ఉద్యోగ ప్రయత్నాలు సాగిస్తున్నాడు. అయితే అవకాశాలు దక్కకపోవడంతో మనస్తాపానికి గురైన అతను గురువారం కళ్యాణదుర్గంలోని రాయదుర్గం బైపాస్ రోడ్డు వద్ద పురుగుల మందు తాగి, కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తెలిపాడు. దీంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని ఆనంద్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతపురంలోని జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నేటి నుంచి
‘ఉపాధి’ గ్రామ సభలు
అనంతపురం టౌన్: ఉపాధి హామీ పథకం పనులపై శనివారం నుంచి జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలను నిర్వహించనున్నారు. ఈ మేరకు డ్వామా పీడీ సలీంబాషా శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తొలగించిన, రద్దు చేయబడిన జాబ్‌కార్డుల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి అర్హులైన వారివి పునరుద్ధరణకు చర్యలు తీసుకోనున్నారు. అలాగే కొత్త జాబ్‌కార్డులకు వినతులు స్వీకరించనున్నారు.


