పారిశుధ్య కార్మికుడిపై టీడీపీ నేతల దాడి
అనంతపురం క్రైం: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న కదిరప్పపై టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన కదిరప్పను స్థానికులు ఆస్పత్రికి చేర్చారు. బాధితుడు తెలిపిన మేరకు.. అనంతపురంలోని వేణుగోపాల్ నగర్‌లో శుక్రవారం చెత్త సేకరణకు వెళ్లిన సమయంలో స్థానిక టీడీపీ బూత్ కన్వీనర్ గోపి ఇంటి వద్ద వారు పెంచుకుంటున్న కుక్క కదిరప్పపై దాడి చేసింది. గతంలో మూడు సార్లు కరిచింది కూడా. ప్రస్తుతం నగర పాలక సంస్థ పరిధిలో వీధి కుక్కల బెడదను తగ్గించేందుకు అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టడంతో వారి దృష్టికి వేణుగోపాల్ నగర్‌లో తరచూ ఇబ్బంది పెడుతున్న కుక్క గురించి కదిరప్ప తీసుకెళ్లాడు. దీంతో శుక్రవారం కుక్కను పట్టుకునేందుకు బండిని వేణుగోపాల్ నగర్‌కు పంపారు. టీడీపీ నేత గోపి ఇంటి వద్ద కుక్కను బంధించ పోతుండగా ఆయన అడ్డుకున్నాడు. ఆ సమయంలో కుక్కలను పట్టేవారితో వాగ్వాదానికి దిగాడు. దీంతో కదిరప్ప జోక్యం చేసుకుని సర్దిచెబుతూ గతంలో పలుమార్లు తనపై కుక్క దాడి చేసి గాయపరిచిందని, ఇదే విషయాన్ని తాను వారికి తెలిపినట్లుగా వివరించాడు. దీంతో కదిరప్ప మీద గోపి ఆగ్రహం వ్యక్తం చేస్తూ కులం పేరుతో దూషిస్తూ టీడీపీ నేతలు కె.నాగరాజు, మహమ్మద్ రఫీ, రాజా, మురళితో కలసి కర్రలతో దాడికి తెగబడ్డాడు. స్థానికులు అడ్డుకుని గాయపడిన కదిరప్పను ఆస్పత్రికి చేర్చారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు పేర్కొన్నాడు. కాగా, కదిరిప్పపై దాడిని కార్మిక సంఘాల నేతలు ఖండించారు. బాధితుడికి న్యాయం చేయకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.


