చదువుపై ఆసక్తి లేక.. భవిష్యత్తుపై బెంగతో..
● ఇంజినీరింగ్ విద్యార్థి బలవన్మరణం
తాడిపత్రి రూరల్/పెద్దపప్పూరు: మండలంలోని కోమలి రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం అహమ్మదాబాద్ నుంచి తిరుచనాపల్లికి వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కో–పైలెట్ నుంచి సమాచారం అందుకున్న తాడిపత్రి ఆర్‌పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్, కానిస్టేబుల్ సుబ్బారెడ్డి అక్కడకు చేరుకుని, పరిశీలించారు. అదే సమయంలో మృతుడి జేబులోని సెల్‌ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేసి మాట్లాడారు. దీంతో మృతుడు పెద్దపప్పూరు మండలం తబ్జుల గ్రామానికి చెందిన రామాంజులు కుమారుడు వంశీ (21)గా నిర్ధారణ అయింది. జరిగిన విషయాన్ని ఫోన్‌లోనే మృతుడి సోదరుడు మహేష్‌కు తెలపడంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని బోరున విలపించారు. చిత్తూరులో ఉన్న శ్రీవెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, టెక్నాలజీ (ఎస్‌వీసీఈటీ)లో బీటెక్ చేస్తున్న వంశీ.. ఆరు నెలల క్రితం ఇంటికి వచ్చాడని, అయితే చదువుపై ఆసక్తి లేకపోవడంతో తిరిగి కళాశాలకు వెళ్లలేదని వివరించారు. ఈ క్రమంలోనే భవిష్యత్తుపై బెంగతో మనోవేదనకు లోనడయ్యాడన్నారు. శుక్రవారం పొలానికి వెళుతున్నట్లు ఇంట్లో ద్విచక్రవాహనంపై బయలుదేరి ఇలా ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


