గడ్డివామికి నిప్పు
యాడికి: మండలంలోని దైవాలమడుగులో గురువారం రాత్రి దుండగులు నిప్పు పెట్టడంతో గడ్డివామి పూర్తిగా కాలిపోయింది. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన రైతు పుల్లారెడ్డి రూ.లక్షతో కొనుగోలు చేసిన జొన్నసొప్ప, వరిగడ్డిని గ్రామ సమీపంలోని తన కల్లంలో వామిగా వేశాడు. అక్కడే ఉన్న రేకుల షెడ్డులో పత్తి బస్తాలను నిల్వ చేశాడు. గురువారం రాత్రి ఎనుములను కల్లంలో కట్టేసి ఇంటికెళ్లి నిద్రించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో గడ్డి వామికి నిప్పంటుకున్నట్లు సమాచారం అందుకున్న పుల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. స్థానికుల సాయంతో ఎనుములను తప్పించి పక్కకు తోలారు. మంటలు ఆర్పేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాగా, పెట్రోల్ వెదజల్లి నిప్పు పెట్టినట్లుగా అక్కడ ఆనవాళ్లు లభ్యమయ్యాయి. గడ్డి వామితో పాటు షెడ్డులోని పత్తి బస్తాలపై దుండగులు పెట్రోల్ వెదజల్లారు. గడ్డివామికి నిప్పు పెట్టి ఉడాయించారు. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, విషయం తెలుసుకున్న లక్షుంపల్లి సర్పంచ్ పద్మనాభరెడ్డి, గ్రామ రైతులు శుక్రవారం ఉదయం క్షేత్ర స్థాయిలో పరిశీలించి, ఘటనపై బాధిత రైతుతో ఆరా తీశారు.


