కుడి కాలువకు నీటి విడుదల మళ్లీ వాయిదా
కూడేరు: మండలంలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) నుంచి ధర్మవరం కుడి కాలువకు ఈ నెల 22న నీటిని విడుదల చేయాలని హెచ్చెల్సీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని మళ్లీ వాయిదా వేశారు. కుడి కాలువ షట్టర్లు మరమ్మతులకు నోచుకోకపోవడమే వాయిదాకు కారణంగా తెలుస్తోంది. ఈ నెల 25న కుడి కాలువకు నీటిని విడుదల చేయినున్నట్లు హెచ్చెల్సీ ఎస్‌ఈ సుధాకర్ రావు గురువారం వెల్లడించారు.
పార్ట్ టైం టీచర్ల భర్తీకి రేపు డెమో
అనంతపురం రూరల్: ఉమ్మడి జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో గెస్ట్, పార్ట్ టైం ప్రాతిపాదికన ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను డెమో కమిటీ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు సాంఘిక సంక్షేమ గురుకులాల జిల్లా సమన్వయ అధికారి జయలక్ష్మి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. బి.పప్పూరు పాఠశాలలో హిందీ, జూనియర్ లెక్చరర్ కెమిస్ట్రీ, ములుగూరు పాఠశాలలో పీజీటీ మ్యాథ్స్, కాలసముద్రం పాఠశాలలో టీజీటీ పీఎస్, పీజీటీ మ్యాథ్స్, రొళ్ల పాఠశాలలో టీజీటీ హిందీ, పీజీటీ ఇంగ్లిష్, మ్యాథ్స్, కురుగుంట బాలికల పాఠశాలలో జూనియర్ లెక్చరర్ తెలుగు, పీజీటీ ఇంగ్లిష్, తిమ్మాపురం బాలికల పాఠశాలలో పీజీటీ మ్యాథ్స్, టీజీటీ పీఎస్, నల్లమాడ బాలికల పాఠశాలలో జూనియర్ లెక్చరర్ ఇంగ్లిష్, అమరాపురం బాలికల పాఠశాలలో జూనియర్ లెక్చరర్ కెమిస్ట్రీ, టీజీటీ పీఎస్, ఉరవకొండ బాలికల పాఠశాలలో జూనియర్ లెక్చరర్ మ్యాఽథ్స్, బ్రహ్మసముద్రం బాలికల పాఠశాలలో జూనియర్ లెక్చరర్ హిస్టరీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి ఉన్న వారు డిగ్రీ, పీజీ, బీఈడీ, టెట్ సర్టిఫికెట్లతో ఈ నెల 22న కురుగుంటలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో నిర్వహించే డెమోకు హాజరు కావచ్చు.
రేపు క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలు
అనంతపురం సిటీ: జిల్లా వ్యాప్తంగా క్లస్టర్స్ కాంప్లెక్స్ సమావేశాలు శనివారం నిర్వహించాలని డీఈఓప్రసాద్‌బాబు గురువారం ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల సహాయకులు, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు 100 శాతం హాజరు కావాలని పేర్కొన్నారు. గైర్హాజరయ్యే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
‘విద్యా శాఖ అధికారులు అందుబాటులో ఉండాలి’
అనంతపురం సిటీ: ప్రభుత్వ పని దినాల్లో విద్యా శాఖలో తలెత్తే సమస్యల పరిష్కారానికి రోజూ డీఈఓలు, ఎంఈఓలు గంటపాటు కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఈఓలు రోజూ సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు, ఎంఈఓలు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు విధిగా కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశాలిచ్చారు.
జూడో క్రీడాకారుడికి ఎస్కేయూ వీసీ అభినందన
అనంతపురం: ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగే ఖేలో ఇండియా పోటీల్లో జూడో విభాగంలో ఏపీ తరఫున పాల్గొంటున్న ఎస్కేయూ ఎంబీఏ రెండో సంవత్సరం విద్యార్థి పి.భాస్కర్‌ను వర్సిటీ ఇన్‌చార్జ్ వీసీ బి.అనిత గురువారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఎస్కేయూ క్రీడా కార్యదర్శి డాక్టర్ బి. జెస్సీ, కోచ్ ఎస్.మహమ్మద్ ఉన్నారు.


