రైతుల సంక్షేమమే లక్ష్యం కావాలి: కలెక్టర్ ఆనంద్
అనంతపురం అర్బన్: ‘రైతులకు అన్ని విధాల తోడుగా ఉంటూ వారి సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి. సాంకేతికతను రైతులు అందింపుచ్చుకునేలా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి. ముఖ్యంగా నేషనల్ బ్యాంబూ మిషన్ కింద వెదురు సాగుకు రైతులను గుర్తించాలి. ఏపీఎంఐపీ కింద రోజూ 200 మంది నుంచి నాన్ సబ్సిడీ కలెక్షన్ వసూలు చేయాలి’ అని కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. కలెక్టర్ గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వ్యవసాయ, అనుబంధ శాఖల అఽధికారులు, రైతు ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ రబీలో సాధారణ సాగు విస్తీర్ణం 1,07,261 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 43,348.2 హెక్టార్లలో పంటలు సాగయ్యాయన్నారు. జిల్లాలో 36,651 టన్నుల యూరియా, డీఏపీ, ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ఎరువులు రైతులకు అందేలా చూడాలని ఆదేశించారు. హార్ట్టికల్చర్ అభివృద్ధికి రెండేళ్ల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. పశు రైతులకు ‘పీకేసీసీ’ కార్డులు మంజూరు చేయాలన్నారు. సమావేశంలో వ్యవసాయ, అనుబంధ శాఖల అఽధికారులు ఉమామహేశ్వరమ్మ, ఉమాదేవి, రఘునాథరెడ్డి, పెన్నేశ్వరి, లక్ష్మానాయక్, పద్మలత, డీసీఓ అరుణకుమారి, ఎల్‌డీఎం నరేష్‌రెడ్డి, నాబర్డ్ ఏజీఎం అనురాధ పాల్గొన్నారు.
అమృత్ పనులు వేగవంతం చేయాలి..
‘అమృత్’ పథకం కింద నగర, పురపాలక సంఘాల పరిధిలో చేపట్టిన పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ప్రజారోగ్య, నగర పాలక సంస్థ, మునిసిపల్ అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతపురం కార్పొరేషన్, గుత్తి, గుంతకల్లు, కళ్యాణదుర్గం మున్సిపాలిటీల పరిధిలో పెండింగ్‌లో ఉన్న లెగసీ వేస్ట్ పనుల పూర్తికి ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో మున్సిపల్ ఆర్‌డీ నాగరాజు పాల్గొన్నారు.
నిబంధనలు పాటించాలి ..
బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కాలుష్య నియంత్రణ చర్యలపై కలెక్టర్ గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ కేంద్రాల్లో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. సమీక్షలో కాలుష్య నియంత్రణ మండలి ఈఈ కిషోర్, డీఎంహెచ్‌ఏ ఎస్‌బీ విష్ణుముర్తి, ప్రజారోగ్యశాఖ ఈఈ ఆదినారాయణ, ఆస్పత్రి సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం, డీసీహెచ్‌ఎస్ డేవిడ్ సెల్వన్‌రాజు, వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.


