చి‘వరి’ దశలో ‘కీటక’ దాడి
జిల్లాలో ఖరీఫ్ వరి పంట కీలక దశకు చేరింది. మరో 20 నుంచి 25 రోజుల్లో కోతకు రానుంది. పంట చివరి దశలో వరి చేలపై కీటక దాడి విజృంభిస్తోంది. ప్రధానంగా హెచ్చెల్సీ ఆయకట్టుతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో సుడిదోమ, ఆకు ఎండు తెగులు (బీఎల్‌బీ), ఆకుముడత, కాండం తొలుచు పురుగు ప్రభావం కనిపిస్తోంది. ఇటీవల రాత్రి సమయంలో చలి తీవ్రత పెరిగి అక్కడక్కడా అగ్గితెగులు వ్యాప్తి మొదలైంది.
● దెబ్బతింటున్న వరి చేలు
● వాతావరణంలో మార్పులతో ఇబ్బందుల్లో రైతులు
రాయదుర్గం: జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో 53,548 ఎకరాల్లో వరి సాగులోకి వచ్చింది. ఇందులో అత్యధికంగా 80 శాతానికి పైగా వరి సాగు హెచ్చెల్సీ ఆయకట్టు పరిధిలోనే ఉంది. సాగు ఆరంభం నుంచే ఆకుఎండు తెగులు (బీఎల్‌బీ) సమస్యాత్మకంగా మారింది. నారుమడి, పిలకలు తోడిగే దశలో ఇది అధిక ప్రభావం చూపినట్లు వ్యవసాయ నిపుణులు గుర్తించారు. అకాల వర్షాలు, చేలలో నీరు చేరడం, నత్రజని అధికంగా చల్లడం, గట్లపై గడ్డి ఏపుగా పెరగడం తదితర కారణాలతో గింజ పాలుపోసుకునే దశలో తెగులు ఉధృతి మరింత పెరిగింది. దీని ప్రభావంతో తాలు గింజలు పెరిగి దిగుబడి దెబ్బతినే ప్రమాదముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో సుడిదోమ ఉధృతి కనిపిస్తోంది. ఇది కూడా పంట దిగుబడిపై ప్రభావం చూపనుంది. మొత్తానికి హెచ్చెల్సీ ఆయకట్టు పరిధిలో సుడిదోమ, కంకినల్లి, అగ్గితెగుళ్లు అధికంగా వ్యాప్తిచెందింది.


