ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయశాఖ జేడీ ఆదేశాల మేరకు గురువారం గుత్తి ఏడీఏ ఎం.వెంకటరాముడు, అనంతపురం రూరల్ ఏఓ వెంకట్‌కుమార్ బృందం జిల్లాలోని పలు ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేపట్టింది. అనంతపురంలోని గుత్తి రోడ్డులో ఉన్న ఉమా గోడౌన్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసిన రూ.2.08 లక్షలు విలువ చేసే 220 లీటర్ల ద్రవరూప ఎరువులు, అలాగే రుద్రంపేటలోని న్యూ శ్రీనివాస ఫర్టిలైజర్స్‌లో రూ.97 వేలు విలువ చేసే 1.20 మెట్రిక్ టన్నుల ఎరువులను సీజ్ చేసినట్లు ఏడీఏ వెంకటరాముడు తెలిపారు. ఈ నెల 30 వరకు తనిఖీలు కొనసాగుతాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్రయ విక్రయాలు చేపట్టినా, రైతులను మోసం చేసే చర్యలు చేపట్టినా శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కళ్యాణదుర్గం రూరల్: స్థానిక గాంధీ చౌక్‌లోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర ట్రేడర్స్‌కు చెందిన నాలుగు ఎరువుల గోడౌన్లలో గురువారం వ్యవసాయాధికారి రవి తనిఖీలు చేపట్టారు. గడువు ముగిసిన, అనుమతుల్లేకుండా రైతులకు విక్రయిస్తున్న రూ.15,24,380 విలువైన 6.75 మెట్రిక్ టన్నుల ఎరువులను సీజ్ చేశారు. అలాగే ముదిగల్లు రోడ్డులో ఉన్న మనగ్రోమోర్ సెంటర్‌ను తనిఖీ చేసి, అనుమతుల్లేని రూ.3,30,410 విలువైన 465 లీటర్ల రసాయన మందులను సీజ్ చేశారు. కార్యక్రమంలో ఏడీఏ యల్లప్ప, ఏఓ శ్రావణ్‌కుమార్, పాల్గొన్నారు.
నా భర్తను రక్షించండి
● కల్పవృక్ష డెవలప్‌మెంట్ సొసైటీ నిర్వాహకురాలు బొగ్గు పుష్ప వేడుకోలు
అనంతపురం టవర్‌క్లాక్: కిడ్నాప్‌కు గురైన తన భర్త బొగ్గు శ్రీరాములును కాపాడాలంటూ కల్పవృక్ష డెవలప్‌మెంట్ సొసైటీ నిర్వాహకురాలు బొగ్గు పుష్ప వేడుకున్నారు. గురువారం అనంతపురంలోని ఎన్జీఓ హోంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సొసైటీని స్థాపించి వివిధ ప్రాజెక్టులు చేపట్టామన్నారు. పెట్టుబడులు పెట్టిన కొందరు రెట్టింపు డబ్బు కావాలని ఒత్తిళ్లు పెంచారన్నారు. ఇటీవల తన భర్తను కర్ణాటకలోని జగలూరుకు చెందిన తిరుమలేసు, పూజ, తిమ్మక్క కిడ్నాప్ చేశారని, అప్పగి నుంచి అతని ఆచూకీ తెలియడం లేదని వాపోయారు. ఈ అంశంపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్లు వివరించారు. సమావేశంలో చంద్రశ్చర్ల హరి, నరేష్ కొడవండ్ల తదితరులు పాల్గొన్నారు.


