చీనీ చెట్ల నరికివేత
యాడికి: మండలంలోని ఓబుళాపురం గ్రామంలో గుర్తు తెలియని దుండగులు 70 చీనీ చెట్లను నరికి వేశారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు.. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం గుట్టలపల్లి గ్రామానికి చెందిన రైతు గొల్ల రంగస్వామి.. ఆరేళ్ల క్రితం యాడికి మండలం ఓబుళాపురం గ్రామ సమీపంలో 9 ఎకరాలను కొనుగోలు చేసి పంటల సాగు చేపట్టాడు. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం 1,140 చీనీ మొక్కలను నాటాడు. మంగళవారం రాత్రి తోటలోకి దుండగులు ప్రవేశించి 70 చీనీ చెట్లను నరికివేశారు. బుధవారం ఉదయం తోటకు వెళ్లిన రంగస్వామి.. చీనీ చెట్లను నరికివేసిన విషయాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో సీఐ ఈరన్న అక్కడు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
వ్యక్తి దుర్మరణం
శింగనమల(నార్పల): ఐచర్ వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కొండూరుకు చెందిన శ్రీనివాసులు (37) వ్యక్తిగత పనిపై బుధవారం నార్పలకు వచ్చాడు. పని ముగించుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై బత్తలపల్లి మీదుగా తిరుగు ప్రయాణమైన ఆయన.. నార్పల మండలం బొందలవాడ వద్దకు చేరుకోగానే ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన ఐచర్ వాహనం ఢీకొంది. ఘటనలో రోడ్డుపై పడిన శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి ఓ కుమారుడు ఉన్నాడు. భార్య లేదు. ఘటనపై నార్పల పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం సిటీ: రాష్ట్రీయ సేవా సమితి(రాస్) ఆధ్వర్యంలో అనంతపురంలో నిర్వహిస్తున్న ప్రతిభావంతుల పాఠశాలలో ఖాళీగా ఉన్న ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.వెంకటరత్నం బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. స్పెషల్ ఎడ్యుకేషన్ బీఎడ్ చేసి, రిహాబిలిటేషన్ ఆఫ్ ఎండియా(ఆర్‌సీఐ) గుర్తింపు కలిగి ఉండాలి. పూర్తి వివరాలకు 0877–224204లో సంప్రదించవచ్చు.
తల్లిపై కొడుకు కత్తితో దాడి
గార్లదిన్నె: మండలంలోని కల్లూరులో షేక్ మాబున్నీపై బుధవారం ఆమె కుమారుడు దూద్‌వలి కత్తితో దాడి చేశాడు. తన పేరున ఇల్లు రాసివ్వలేదని ఆగ్రహంతో కత్తితో దాడి చేయడంతో మాబున్నీ ఎడమ చేతిపై తీవ్ర గాయమైంది. వెంటనే కుటుంబసభ్యులు అనంతపురంలోని జీజీహెచ్‌కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


