చారిత్రక వారసత్వాన్ని కాపాడుకుందాం
●కలెక్టర్ ఆనంద్
అనంతపురం కల్చరల్: చరిత్ర వారసత్వాన్ని కాపాడుకోవడంలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. ఇంటాక్, పర్యాటక శాఖ, మ్యూజియం శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ వారసత్వ వారోత్సవాలను బుధవారం వేడుకగా నిర్వహించారు. తొలిరోజు హెరిటేజ్ వాక్‌ను కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ప్రారంభించారు. చరిత్రాత్మక కట్టడాల ప్రాధాన్యతను విద్యార్థులకు అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వివరించారు. యువత, విద్యార్థులు తరచు చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తూ వాటి ప్రాధాన్యతను తెలుసుకోవాలన్నారు. చరిత్ర స్పృహను పెంపొందించుకుని వారసత్వాన్ని కాపాడుకోవాలని సూచించారు. అనంతరం చిన్నారులకు కాన్వాస్ బ్యాగులు, మ్యాగ్నెట్ మగ్‌లు, క్యాలెండర్లు, బ్యాడ్జ్‌లను డిస్కవర్ అనంతపురం నిర్వాహకులు ఉచితంగా అందించారు. అంతకు ముందు వందలాది మంది విద్యార్థులు, అధికారులు, పలు శాఖల సిబ్బందితో కలిసి కలెక్టరేట్ నుంచి జిల్లా మ్యూజియం వరకూ హెరిటేజ్ వాక్ సాగింది. కార్యక్రమంలో డీఈఓ ప్రసాద్‌బాబు, పురావస్తు శాఖ ఏడీ స్వామినాయక్, పర్యాటక శాఖ అధికారి జయకుమార్, ఏఎంసీ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ పావని, డిస్కవర్ అనంతపురం ఏజీ అనిల్‌కుమార్‌రెడ్డి, రమేష్‌నారాయణ, ఇంటాక్ కన్వీనర్ రామకుమార్, ప్రతినిధులు పి.కృష్ణమూర్తి, షరీఫ్, రియాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.


