జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలి
అనంతపురం సిటీ: జాతీయ స్థాయిలో సత్తా చాటి జిల్లా కీర్తిని చాటాలని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్–2025 జాతీయ స్థాయి సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శనలో పెద్దపప్పూరు మండలం చీమలవాగుపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ప్రవళ్లిక, కళ్యాణి, షబానా రూపొందించిన సోలార్ బేస్డ్ మెడిసిన్ స్ప్రేయర్ ప్రాజెక్ట్ ఎంపికై ంది. దేశ వ్యాప్తంగా 72 వేల నమూనాల నుంచి ఎంపిక చేసిన 100 బెస్ట్ నమూనాల్లో మన జిల్లా విద్యార్థినుల నమూనా ఉండడం గమనార్హం. ఏఐఎం అటల్ ఇన్నోవేషన్ వారు ఫైనల్‌గా 30 నమూనాలు ఎంపిక చేయనుండగా, అందుకు డిసెంబర్‌లో మరోసారి జాతీయ స్థాయి పోటీ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో అందుకు అవసరమైన శిక్షణను ముగ్గురు బాలికకు అనంతపురం సైన్స్ సెంటర్‌లో ఏర్పాటు చేశారు. మంగళవారం బాలికలను కలెక్టర్ ఆనంద్ వద్దకు విద్యా శాఖాధికారులు తీసుకెళ్లారు. బాలికలను కలెక్టర్ అభినందిస్తూ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రధానోపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం, ఫిజిక్స్ ఉపాధ్యాయులు, గైడ్ టీచర్లు పాల్గొన్నారు.


