మట్టి తవ్వకాల అడ్డగింత
బొమ్మనహాళ్: మండల కేంద్రం సమీపంలోని ఆంధ్రా–కర్ణాటక సరిహద్దులోని హెచ్చెల్సీ కాలువ పక్కనే జరుగుతున్న మట్టి తవ్వకాలపై అధికారులు స్పందించారు. ఈనెల 17న ‘సాక్షి’లో ‘యథేచ్చగా తవ్వకాలు .. రైతుల కంగారు’ శీర్షిక ప్రత్యేక కథనం ప్రచురితమైంది. స్పందించిన సరిహద్దు, బొమ్మనహాళ్ హెచ్చెల్సీ ఏఈఈలు రంజిత్‌కుమార్, అల్తాఫ్ మంగళవారం మట్టి తవ్వకాలు జరిపిన స్థలాన్ని పరిశీలించారు. హెచ్చెల్సీ కాలువకు దగ్గరగా మట్టి తవ్వితే కాలువ బలహీనపడే ప్రమాదం ఉందని గుర్తించి పొలం రైతు చంద్రన్నకు ఇకపై ఏ విధమైన తవ్వకాలు చేయరాదని ఆదేశాలు జారీ చేశారు. మరోసారి తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే తవ్విన గుంతలను వెంటనే పూడ్చేలా చర్యలు తీసుకున్నారు.
కారు ఢీకొని యువకుడి మృతి
కూడేరు: మండల కేంద్రమైన కూడేరు – ముద్దలాపురం గ్రామాల మధ్యలో అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారిపై కారు ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారుడు బాట పెద్దన్న (22) మృతి చెందాడు. మరో యువకుడు శ్రీకాంత్ గాయపడ్డాడు. పోలీసుల వివరాల మేరకు.. కూడేరుకు చెందిన బాట మారెన్న కుమారుడు బాట పెద్దన్న , ఈడిగ ఎర్రిస్వామి కుమారుడు శ్రీకాంత్ ముద్దలాపురం వద్ద ఉన్న సుజలాన్ కంపెనీ గాలి మరల ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి దాటాకా విధులు ముగించుకొని ఇద్దరూ బైక్‌పై ఇంటికి బయలుదేరారు. పోలీసుస్టేషన్‌కు కొంత దూరంలో ఉరవకొండ వైపు వెళుతున్న కారు అదుపు తప్పి స్కూటర్‌ను ఢీకొట్టింది. డ్రైవింగ్ చేస్తున్న పెద్దన్న తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి చెందాడు. శ్రీకాంత్ గాయపడ్డాడు. అదే సమయంలో అటు వెళుతున్న భాస్కర్ కూడా గాయపడగా.. క్షతగాత్రులను 108 వాహనంలో అనంతపురం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
కాలుజారి కింద పడి
మహిళ మృతి
బెళుగుప్ప: మండల పరిధిలోని వీరాంజనేయ కొట్టాల సమీపంలో మంగళవారం అరటి తోటకు రసాయన మందు పిచికారీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన ద్రావణాన్ని తాగి 20 మేకలు, ఒక పొట్టేలు మృతి చెందాయి. ఘటనను చూసేందుకు ఆత్రుతతో వెళ్లిన సమీప పొలానికి చెందిన దుద్దేకుంట గ్రామానికి చెందిన కాశెప్పగారి రామాంజినమ్మ (49) కాలు మడతపడటంతో కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. హుటాహుటిన ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషపు ద్రావణం తాగిన మరో 15 మేకలకు పశువైద్య సహాయకులు ఎర్రిస్వామి, పశువైద్యాధికారి మంజునాథ పర్యవేక్షణలో చికిత్స అందించారు. 21 జీవాల మృతితో రూ.3 లక్షలు నష్టం వాటిల్లిందని సంజీవులు, మారెన్న ఆవేదన వ్యక్తం చేశారు.
శవమై తేలిన తిప్పేస్వామి
కణేకల్లు: మూడ్రోజుల క్రితం అదృశ్యమైన కణేకల్లుకు చెందిన బోయ తిప్పేస్వామి (34) మంగళవారం తుంబిగనూరు శివారులోని హెచ్చెల్సీ కాలువలో శవమై తేలాడు. పోలీసుల కథనం మేరకు... స్థానిక నేసేపేటకు చెందిన బోయ తిప్పేస్వామి టైలరింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య భారతి, ఇద్దరు కుమారులున్నారు. ఆదివారం ఇంటి నుంచి వెళ్లిన తిప్పేస్వామి తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో తల్లీ లక్ష్మీదేవి తన కుమారుడు అదృశ్యమయ్యాడని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మూడ్రోజుల తర్వాత తిప్పేస్వామి హెచ్చెల్సీ కాలువలో శవమై కన్పించాడు. మృతికి గల కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
సేవాఘడ్‌ను సందర్శించిన విశ్రాంత అధికారులు
గుత్తి రూరల్: మండలంలోని సేవాఘడ్‌ను విశ్రాంత జిల్లా వ్యవసాయాధికారులు మంగళవారం సందర్శించారు. వ్యవసాయశాఖ విశ్రాంత జేడీఏ ఠాగూర్‌నాయక్ ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వ్యవసాయశాఖలో వివిధ హోదాలలో ఉన్నత స్థాయి అధికారులుగా పని చేసి పదవీ విరమణ చేసిన 20 మంది అధికారులు సేవాఘడ్‌లో పర్యటించారు. ముందుగా వారు బాచుపల్లి బాట సుంకులమ్మ అమ్మవారిని దర్శించుకొని అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి వారు సేవాఘడ్‌కు చేరుకొని సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్, మాతా జగదాంబ ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు.
మట్టి తవ్వకాల అడ్డగింత
మట్టి తవ్వకాల అడ్డగింత
మట్టి తవ్వకాల అడ్డగింత
మట్టి తవ్వకాల అడ్డగింత
మట్టి తవ్వకాల అడ్డగింత


