ఆర్థిక సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య
కళ్యాణదుర్గం రూరల్: ఆర్థిక సమస్యలు తాళలేక లక్షన్న (60) ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవార చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు... మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లుకు చెందిన లక్ష్మన్న, నాగమ్మ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. ఇటీవల లక్ష్మన్న కుటుంబ పోషణ కోసం రూ.5 లక్షలు అప్పులు చేశాడు. అప్పు తీర్చే మార్గంలేక మనోవేదనతో గ్రామ సమీపంలో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఉరివేసుకొని మరొకరు ..
అనంతపురం సెంట్రల్: నగరంలోని ఓ యుడకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. శింగనమలకు చెందిన తిరుమలేసు (41) సోమవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్నేళ్లుగా కుటుంబానికి దూరంగా ఉన్నాడు. రోజంతా పేపర్లు, ప్లాస్టిక్ వస్తువులు సేకరించగా వచ్చే డబ్బులతో జీవనం సాగించేవాడు. అశోక్‌నగర్‌లోని గుజిరి షాపులోనే ఉంటున్నాడు. మనస్థాపంతో సోమవారం రాత్రి ఉరేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
ప్రొఫెసర్‌పై వరకట్న వేధింపుల కేసు నమోదు
గుత్తి: గుత్తికి చెందిన డాక్టర్ ప్రియాంకను అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేసిన ఘటనలో ఆమె భర్త, ప్రొఫెసర్ ధనుంజయ కుమార్, ఆయన తల్లిదండ్రులు నాగేశం, రామ తులసిపై మంగళవారం రాత్రి వరకట్న వేధింపుల కేసు నమోదైంది. అనంతపురానికి చెందిన ధనుంజయ కుమార్, గుత్తికి చెందిన డాక్టర్ ప్రియాంకను 2022లో వివాహం చేసుకున్నాడు. ఇటీవల అతనితో పాటు ఆయన తల్లిదండ్రులు ప్రియాంకను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. రెండు రోజులు క్రితం ప్రియాంక వరకట్న వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారించిన గుత్తి పోలీసులు కేసు నమోదు చేశారు.
‘మిగులు భూమి’లో సాగుపై నోటీసు
రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండల పరిధిలోని అనంతపురం–చైన్నె జాతీయ రహదారి పక్కన కందుకూరు పొలం 430–2 సర్వే నంబరులో 85 సెంట్ల ప్రభుత్వ భూమిలో మామిడి మొక్కలు నాటి, ఉలవలు విత్తిన కృష్ణంరెడ్డిపల్లికి చెందిన టీడీపీ నాయకుడు తిరుతపయ్యకు తహసీల్దార్ మోహన్‌కుమార్ నోటీసు జారీ చేశారు. వీఆర్‌ఓ గోవిందనాయక్ అందజేశాడు. రూ. 2.20 కోట్ల విలువైన ఈ 85 సెంట్ల స్థలం ప్రభుత్వ రికార్డుల్లో మిగులు భూమిగా ఉంది. ఈ భూమిని కొందరు కొట్టేయాలని స్కెచ్ వేశారు. ఈ క్రమంలోనే మామిడి మొక్కలు నాటడంతో పాటు ఉలవ పంట సాగు చేశారు. ఈ వ్యవహారంపై ఈనెల 6న ‘సాక్షి’లో ‘మిగులు భూమిని మింగేద్దామని’ శీర్షికన ప్రచురితమైన కథనానికి కలెక్టర్ ఆనంద్ స్పందించి రెవెన్యూ, డ్వామా అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద మామిడి మొక్కలు సాగు చేశారనే ఆరోపణల నేపథ్యంలో డ్వామా పీడీ సలీంబాషా రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించిన టెక్నికల్ అసిస్టెంట్ ఓబులేసు ఉపాధి హామీ పథకం కింద మొక్కలు నాటలేదని వివరణ ఇచ్చాడు. ఈ క్రమంలో ప్రభుత్వ భూమిలో ఎలా సాగు చేస్తావంటూ తాజాగా రెవెన్యూ అధికారులు తిరుపతయ్యకు నోటీసు జారీ చేశారు. 24న విచారణకు హాజరుకాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యాలయంలోని రికార్డుల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
ఆర్థిక సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య


