జగన్ పర్యటన ఏర్పాట్ల పరిశీలన
రాప్తాడు: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 23న జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి, తోపుదుర్తి నయనతారెడ్డి దంపతుల కుమారై మోక్షిత విష్ణుప్రియారెడ్డి, తేజేష్‌రెడ్డి వివాహానికి వైఎస్ జగన్ హాజరయ్యే అవకాశం ఉందని వైఎస్సార్‌సీపీ నాయకులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం 44వ జాతీయ రహదారిపై హెచ్‌పీ పెట్రోలు బంక్ ఎదురుగా ఏర్పాటు చేస్తున్న కల్యాణ మండపం, గంగలకుంట రోడ్డులో సిద్ధం సభకు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ స్థలం, లింగనపల్లి రోడ్డులో బొమ్మేపర్తి సచ్చిదానంద స్వామి ప్రవేశ ద్వారం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసే హెలిప్యాడ్ ప్రాంతాన్ని పార్టీ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. వివాహ మహోత్సవానికి పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున రానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేసులు, సీఐ శ్రీహర్షతో నేతలు చర్చించారు.
చంద్రబాబు ప్రభుత్వంలో రాయలసీమకు అన్యాయం
● మాజీ మంత్రి శైలజనాథ్
అనంతపురం: చంద్రబాబు ప్రభుత్వంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. అనంతపురంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీమలో న్యాయ యూనివర్సిటీ, హైకోర్టు వంటి వాటిని కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయకుండా కక్ష గట్టి వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు రాయలసీమలో పుట్టినా .. రాయలసీమ ఔన్నత్యాన్ని కాలరాస్తున్నారని విమర్శించారు. మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రంగా విడిపోయిన తర్వాత శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధానితో పాటు, ఈ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా ఎన్నో ఒప్పందాలు జరిగాయన్నారు. చివరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత శ్రీకృష్ణ కమిటీ రాయలసీమకు అభివృద్ధి చేకూర్చే విధంగా కొన్ని ప్రతిపాదనలు చేసిందని, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత రాయలసీమ ప్రయోజనాలను విస్మరించారన్నారు.
జగన్ పర్యటన ఏర్పాట్ల పరిశీలన


