రోడ్డు ప్రమాదంలో పోస్టల్ బీపీఎం మృతి
శెట్టూరు: మండలంలోని ములకలేడు గ్రామానికి చెందిన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం) తిప్పేస్వామి (57) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు... తిప్పేస్వామి సోమవారం విధులు ముగించుకొని సొంత పని నిమిత్తం అమరాపురం గ్రామానికి వెళ్లాడు. పనులు ముగించుకొని ద్విచక్ర వాహనంలో నాగేపల్లిగేటు, పరుశురాంపురం మీదుగా ములకలేడు సొంత గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. అయితే కర్ణాటక రాష్ట్రం పరుశురాంపురం మండల పరిధిలోని గౌరిపురం వద్ద గతుకులుగా ఉన్న రోడ్డులో బైక్ అదుపు తప్పింది. తీవ్రంగా గాయపడిన తిప్పేస్వామిని అటుగా వస్తున్న వారు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలపారు. ప్రమాద స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతుడి కుమారుడు సాయినాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసినట్లు కర్ణాటక పోలీసులు తెలిపారు. పోస్టల్ ఉద్యోగి తిప్పేస్వామి మృతి విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎంపీ తలారి రంగయ్య ములకలేడులో జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చామలూరు రాజ్‌గోపాల్ తదితరులున్నారు.
రోడ్డు ప్రమాదంలో పోస్టల్ బీపీఎం మృతి


