వేదన.. అరణ్య రోదన
అనంతపురం క్రైం: రాత్రనకా, పగలనకా కష్టించి పనిచేసిన కార్మికుల పీఎఫ్ ఖాతాల రికార్డులు కనిపించకుండా పోయాయి. అనంతపురం నగరపాలక సంస్థలో 1990–2010 కాలంలో పని చేసిన సుమారు 400 మంది కార్మికులకు రూ.3 కోట్ల మేర పీఎఫ్ డబ్బు నేటికీ అందలేదు. ఏళ్ల తరబడిగా తిరుగుతున్నా రికార్డుల్లేవంటూ అధికారులు చేతులెత్తేస్తుండడంతో బాధితుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. కార్మికుడి వేతనాన్ని బట్టి పీఎఫ్ ఉంటుంది. ఒక్కో కార్మికుడి వేతనం నుంచి నెలకు సుమారు రూ.600 చొప్పున పీఎఫ్ కట్ చేస్తారు. ఇలా ఏడాదికి రూ.7,200 ప్రకారం 9 ఏళ్లకు 64,800 అవుతుంది. ఇక కాంట్రాక్టర్ వైపు నుంచి కూడా కార్మికుడి పీఎఫ్ ఖాతాకు రూ.64,800 జమ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం వైపు నుంచి అందే వడ్డీని కలిపితే రూ.1.34 లక్షలవుతుంది. ఏడాదికి కొంత వడ్డీ కలుపుతూ పోయినా ఒక్కో కార్మికుడికి రూ.3 లక్షల మేర జమ కావాలి. 15 ఏళ్లకు వడ్డీతో కలిపి నగదు రావాల్సి ఉన్నా, వారి కష్టార్జితానికి దిక్కూమొక్కు లేకుండా పోవడం గమనార్హం.
అధికారుల నిర్లక్ష్యం..
ఉమ్మడి జిల్లాలోని తాడిపత్రి, ధర్మవరం, రాయదుర్గం, గుత్తి మున్సిపాలిటీల్లో 2002 నుంచే పీఎఫ్ రికార్డులు ఉండగా, అనంతపురంలో మాత్రం 2010కి ముందు పీఎఫ్ రికార్డులే లేకపోవడం ఇక్కడి అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. అధికారులు వాటిని చెత్త కుప్పల్లో వేసినట్లు తెలుస్తోంది. ఎండనక, వాననక మురికి కాలువల్లో మలమూత్రాలను సైతం ఎత్తివేశామని, అలాంటి తమ గోడు పట్టించుకోకపోవడం అన్యాయమని బాధితులు వాపోతున్నారు. ఉన్నతాధికారులైనా స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.
పారిశుధ్య కార్మికులకు
రూ. 3 కోట్ల మేర అందని పీఎఫ్ డబ్బు
పట్టించుకోని నగరపాలక అధికారులు
రికార్డుల్లేవంటూ చేతులెత్తేస్తున్న వైనం


