ఒట్టిమాటలు.. ఉత్తచేతులు | - | Sakshi
Sakshi News home page

ఒట్టిమాటలు.. ఉత్తచేతులు

Nov 19 2025 5:49 AM | Updated on Nov 19 2025 5:49 AM

ఒట్టిమాటలు.. ఉత్తచేతులు

ఒట్టిమాటలు.. ఉత్తచేతులు

అనంతపురం అగ్రికల్చర్‌: చంద్రబాబు సర్కారు తీరు మారడం లేదు. రైతులను దగా చేస్తూనే ఉన్నారు. అధికారం చేపట్టిన తర్వాత దాదాపు 14 నెలల పాటు రైతులకు నయాపైసా అందించలేదు. ఏకంగా రూ.400 కోట్ల మేర ఎగ్గొట్టారు. తాజాగా ఈ ఏడాది అమలు చేస్తున్న ‘పీఎం కిసాన్‌–అన్నదాత సుఖీభవ’ పథకంలోనూ కొర్రీలు వేసి ఉత్తచేతులు చూపుతున్నారు. గత ఆగస్టులో మొదటి విడతగా కేంద్రం నుంచి రూ.2 వేలు, రాష్ట్రం వాటాగా రూ.5 వేలు ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో రకరకాల కారణాలతో ఇప్పటికీ 5 వేల మందికి పైగా సొమ్ము జమ కాని పరిస్థితి. సాయం కోసం అధికారులు, బ్యాంకుల చుట్టూ ఇప్పటికీ బాధితులు తిరుగుతూనే ఉన్నారు. కనీసం రెండో విడతలోనైనా సొమ్ము జమ అవుతుందని ఆశ పెట్టుకున్న వారికి మళ్లీ నిరాశే మిగిలింది.

అప్పటికి, ఇప్పటికి ఎంతో తేడా..

రెండో విడతగా పీఎం కిసాన్‌ కింద 2.55 లక్షల మంది రైతులకు రూ.51.16 కోట్లు, అన్నదాత సుఖీభవ ద్వారా 2.75 లక్షల మంది రైతులకు రూ.137.82 కోట్లు బుధవారం విడుదల చేయనున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. అయితే, గత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో సాయం అందుకున్న లబ్ధిదారులకు, నేడు చంద్ర బాబు సర్కారులో చూపుతున్న లెక్కలకు పొంతన లేకపోవడం గమనార్హం. గతంలో ‘పీఎం కిసాన్‌’ కింద 2.85 లక్షల మంది, ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ కింద 2.94 లక్షల మంది వరకు రైతులకు క్రమం తప్పకుండా సొమ్ము జమ చేయగా.. నేడు ‘పీఎం కిసాన్‌’లో రైతుల సంఖ్యను 2.55 లక్షలకు కుదించారు. అంటే దాదాపు 30 వేల మంది రైతులను జాబితా నుంచి తొలగించేశారు. అలాగే ‘సుఖీభవ’ కింద 2.75 లక్షల మందికి మాత్రమే ఇస్తూ 20 వేల మంది రైతులకు కుచ్చుటోపీ పెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తొలి ఏడాది పూర్తిగా..

అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల ముందు గొప్పగా చెప్పిన చంద్రబాబు మాటలు.. ఆయన ముఖ్యమంత్రి కాగానే ఒట్టివిగానే మిగిలిపోయాయి. ఇదిగో అదిగో అంటూ నెలల పాటు కాలం గడిపి... చివరకు పీఎం కిసాన్‌తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.14 వేలు ఇస్తామన్నారు. కనీసం రూ.14 వేల ప్రకారం మొదటి ఏడాది ఇచ్చి ఉంటే జిల్లా రైతులకు రూ.400 కోట్ల మేర లబ్ధి చేకూరేది. కానీ, రైతులకు పైసా అందించకుండా పంగనామాలు పెట్టేశారు. సాధారణంగా ఏటా రైతుల సంఖ్య, భూమి పాస్‌పుస్తకాల సంఖ్య కొంతైనా పెరుగుతూ ఉంటుంది. ఈ లెక్కన గత ప్రభుత్వంలో కన్నా రైతుల సంఖ్య పెరగాల్సి ఉండగా అందుకు భిన్నంగా తగ్గిపోవడం గమనార్హం. ఈ–కేవైసీ, ఎన్‌పీసీఐ లింక్‌, మ్యాపింగ్‌ లేదంటూ సాయం అందించకుండా మోసం చేస్తుండడంపై రైతులు మండిపడుతున్నారు.

తీరు మారని చంద్రబాబు సర్కారు

‘పీఎం కిసాన్‌– అన్నదాత సుఖీభవ’లో కొర్రీలతో సాయం ఎగనామం

50 వేల మంది రైతులకు కుచ్చుటోపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement