నేడు ప్రధాని మోదీ రాక
పుట్టపర్తి టౌన్: ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పుట్టపర్తికి రానున్నారు. భగవాన్ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 10 గంటలకు సత్యసాయి విమానాశ్రయం చేరుకోనున్నారు. అనంతరం ప్రత్యేక కాన్వాయిలో వెళ్లి సత్యసాయి మహా సమాధిని దర్శించుకోనున్నారు. అనంతరం శత జయంతి వేడుకల్లో పాల్గొని బాబా జీవితం, బోధనలు, శాశ్వత వారసత్వాన్ని స్మరించేందుకు రూపొందించిన స్మారక నాణెం, తపాలా స్టాంపుల సమితిని విడుదల చేయనున్నారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి దక్షిణ భారత సహజ వ్యవసాయ సదస్సులో పాల్గొననున్నారు. ఈ మేరకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ భారీ ఏర్పాట్లు చేసింది. హిల్‌వ్యూ స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. ప్రధానితోపాటు పలువురు ప్రముఖుల కోసం వేదిక సిద్ధం చేశారు. మూడు రోజులుగా ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహించి పోలీస్ సిబ్బంది భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. విమానాశ్రం నుంచి పుట్టపర్తి వరకు బారికేడ్లు ఏర్పాటు చేసి పటిష్ట భద్రత కల్పిస్తున్నారు.
సీఎంకు ఘనస్వాగతం
సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన ముఖ్యమంత్రి, చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి మంగళవారం సాయంత్రం 5.15 గంటలకు పుట్టపర్తి విమానాశ్రం చేరుకున్నారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, మంత్రులు సవిత, సత్యకుమార్ యాదవ్, చీఫ్ సెక్రటరీ విజయానంద్, కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్‌కుమార్, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
ముందుగానే పుట్టపర్తి చేరుకున్న సీఎం, మంత్రులు
కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసిన పోలీస్ యంత్రాంగం
నేడు ప్రధాని మోదీ రాక


