డీ హీరేహాళ్ ఎంపీడీఓ ‘పచ్చ’ భక్తి
న్యూస్‌రీల్
సాక్షి టాస్క్‌ఫోర్స్: ‘పచ్చ’ భక్తిని చాటుకున్న డీ హీరేహాళ్ ఎంపీడీఓ దాసనాయక్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ డీ హీరేహాళ్ మండల కన్వీనర్ మోహన్‌రెడ్డిని మంగళవారం ఏకంగా ఎంపీడీఓ కార్యాలయంలోనే సన్మానించడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ జీతం తీసుకుంటూ టీడీపీ నాయకుల సేవలో తరించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీడీఓ తీరుపై రాయదుర్గం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ గౌని ప్రతాప్‌రెడ్డి, బీఎస్పీ ఇన్‌చార్జ్ చిందనూరు నాగరాజు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ కార్యాలయాన్ని టీడీపీ కార్యాలయంగా మార్చేయడం అన్యాయమన్నారు. కలెక్టర్, జెడ్పీ సీఈఓ స్పందించి ఎంపీడీఓతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న వారందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
20న మెగా జాబ్‌మేళా
అనంతపురం టౌన్: ఉప్పరపల్లి సమీపంలోని ఏఎఫ్ ఏకాలజీ సెంటర్‌లో ఈనెల 20న మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి పీవీ ప్రతాప్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 10 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయన్నారు. 10వ తరగతి, ఐటీఐ, డిగ్రీ ఆపై విద్యార్హతలున్న నిరుద్యోగ యువతి, యువకులు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. వివరాలకు 90100 39901 నంబర్‌లో సంప్రదించాలన్నారు.


