ఆత్మకూరు: మండలంలోని పంపనూరు సమీపంలో హంద్రీ–నీవా కాలువలో ఈత కోసం దిగి గల్లంతైన డాక్టర్ కార్తీక్‌రెడ్డి (38) మృతదేహం లభ్యమైంది. ఎస్‌ఐ లక్ష్మణరావు తెలిపిన మేరకు.. అనంతపురంలో నివాసముంటున్న కార్తీక్ రెడ్డి బెళుగుప్ప పీహెచ్‌సీలో డాక్టర్‌గా పని చేస్తున్నారు. ఆదివారం బంధువులతో కలిసి పంపనూరు సిటీ పార్కుకు వన భోజనాల నిమిత్తం వచ్చారు. భోజనాల అనంతరం పంపనూరు హంద్రీ–నీవా కాలువలో ఈత కొట్టేందుకు దిగారు. కాలువలో నీటి ప్రవాహ వేగం అధికంగా ఉండడంతో కొట్టుకుపోయారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కాలువలో గాలించినా ఫలితం లేకపోయింది. సోమవారం పంపనూరు తండా సమీపంలో కాలువలో మృతదేహం కొట్టుకుపోతుండటం చూసిన ఓ గొర్రెల కాపరి స్థానికులకు తెలిపాడు. వారిచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న బంధువులు కార్తీక్ రెడ్డి మృతదేహంగా గుర్తించారు. భర్త మృతదేహాన్ని చూసి భార్య శ్రావణి గుండెలవిసేలా రోదించింది. ‘నన్ను, కూతుర్ని ఒంటరిని చేసి వెళ్లిపోయావా’ అంటూ ఆమె విలపించిన తీరు అందరినీ కన్నీళ్లు పెట్టించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ లక్ష్మణరావు తెలిపారు.
డాక్టర్ కార్తీక్ మృతదేహం లభ్యం


