పంట నష్ట పరిహారం అందించాలి
అనంతపురం అర్బన్: అకాలవర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారాన్ని అందించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పరిష్కార వేదిక కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి గౌస్‌బేగ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి మారుతీనాయుడు, మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లాబేగ్, ఎస్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ... ఈ ఏడాది మార్చిలో కురిసిన అకాల వర్షాలకు పుట్లూరు, యల్లనూరు, తాడిపత్రి, పెద్దవడుగూరుతో పాటు పలు మండలాల్లో అరటి, మొక్కజొన్న, దానిమ్మ తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. రూ.47.47 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వానికి అప్పటి కలెక్టర్ వినోద్‌కుమార్ నివేదిక కూడా పంపించారన్నారు. అయితే ఇప్పటికీ రైతులకు పరిహారం అందలేదన్నారు. రైతులకు పరిహారం అందించకపోతే రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
రోడ్డెక్కిన అరటి రైతు
అరటి పంటను ప్రభుత్వమే గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయాలంటూ సోమవారం కలెక్టరేట్ ఎదుట పండ్ల తోటల రైతు సంఘం ఆధ్వర్యంలో ఉద్యాన రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పండ్ల తోటల రైతు సంఘం జిల్లా కార్యదర్శి శివారెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడారు. టన్ను రూ.15వేలతో ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ ఆనంద్‌కు వినతిపత్రం అందజేశారు.
అరటికి గిట్టుబాటు ధర కల్పించాలి
అరటికి గిట్టుబాటు ధర కల్పించి టన్ను రూ.22 వేలతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చెన్నప్ప యాదవ్, చిరుతల మల్లికార్జున డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అరటి రైతులను ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
కౌలు రైతులకు ‘సుఖీభవ’ వర్తింపజేయాలి
అన్నదాత సుఖీభవ పథాకం కింద కౌలు రైతులకు ఒకేసారి రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇవ్వాలని, ఎన్నికల హామీ మేరకు నూతన కౌలు చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట నాయకులు, రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి బాలరంగయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి మాట్లాడారు. అనంతరం కలెక్టర్ ఆనంద్‌కు నాయకులు వినతిపత్రం అందజేశారు.
వైఎస్సార్‌సీపీ నాయకుల డిమాండ్
పరిష్కార వేదికలో వినతిపత్రం అందజేత
పంట నష్ట పరిహారం అందించాలి


