ఆటో బోల్తా – వ్యక్తి మృతి
వజ్రకరూరు: మండలంలోని చిన్నహోతురు సమీపంలో ఆటో బోల్తాపడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. వజ్రకరూరు మండలం గడేహోతురు గ్రామానికి చెందిన ఆటో సోమవారం మధ్యాహ్నం ప్రయాణికులతో ఉరవకొండ నుంచి గడేహోతురుకు బయలుదేరింది. చిన్నహోతురు సమీపంలోకి చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డుపై ఆటో బోల్తాపడింది. ఘటనలో పామిడి మండలం రామగిరి గ్రామానికి చెందిన కురుబ తిరుపతయ్య (55), గడేహోతురుకు చెందిన బెస్త మారుతి, సావిత్రమ్మ, గుత్తికి చెందిన లింగమ్మ తదితరులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ప్రైవేట్ వాహనంలో గుంతకల్లులోని ప్రైవేట్ ఆస్పత్రికి క్షతగాత్రులను చేర్చారు. చికిత్స పొందుతూ తిరుపతయ్య మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్ మోకా సురేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, కేసు దర్యాప్తు చేపట్టారు.
వివాహిత దుర్మరణం
● మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
గార్లదిన్నె: లారీ ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై కుటుంబసభ్యులతో కలసి వెళుతున్న వివాహిత దుర్మరణం పాలైంది. పోలీసులు తెలిపిన మేరకు.. శింగనమలకు చెందిన పోతన్న, రమాదేవి (35) దంపతులు తమ కుమారుడు శివతో కలసి పామిడిలో నివాసముంటున్నారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత పనిపై ముగ్గురూ శింగనమలకు వెళ్లిన వారు సోమవారం ఉదయం తమ బంధువు శేఖర్‌తో కలసి నలుగూరు ఒకే ద్విచక్ర వాహనంపై పామిడికి తిరుగు ప్రయాణమయ్యారు. గార్లదిన్నె మండలం తిమ్మంపేట క్రాస్ సమీపంలోకి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన పార్శిల్ సర్వీసు లారీ ఢీకొంది. ఘటనలో రోడ్డుపై పడిన రమాదేవి తలపై లారీ చక్రాలు దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోతన్న, శివ, శేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ లారీతో పాటు ఉడాయించాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడకు చేరుకుని క్షతగాత్రులను అనంతపురంలోని జీజీహెచ్‌కు తరలించింది. విషయం తెలుసుకున్న గార్లదిన్నె పీఎస్ ఎస్‌ఐ గౌస్ మహమ్మద్ బాషా వెంటనే స్పందించి కల్లూరు వద్ద లారీని స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
వివాహిత హత్య కేసులో మరో ఇద్దరి అరెస్ట్
బెళుగుప్ప: మండల కేంద్రంలోని బీసీ కాలనీలో ఈ నెల 13న చోటు చేసుకున్న వివాహిత శాంతి హత్య కేసులో ముగ్గురిపై కేసు నమోదు కాగా, ఇప్పటికే భర్త ఆంజనేయులును పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. సోమవారం తిప్పేస్వామి, జయసింహను గుండ్లపల్లి క్రాస్ వద్ద అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.


