జనరేటర్‌లోకి దూరి అజ్ఞాత వ్యక్తి మృతి
అనంతపురం సెంట్రల్: జనరేటర్‌లోకి దూరిన వ్యక్తి కరెంట్ షాక్‌కు గురై మృతిచెందాడు. తొమ్మిది రోజుల ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన మేరకు... సోమవారం ఉదయం అనంతపురంలోని సాయినగర్ మొదటి క్రాస్‌లో ఉన్న భారతీ హాస్పిటల్‌కు చెందిన జనరేటర్ వద్ద దుర్వాసన వెదజల్లుతుండడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. జనరేటర్ తలుపు తీసి చూడగా వ్యక్తి మృతదేహం కనిపించింది. ఆస్పత్రి వద్ద ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా ఈ నెల 8న రాత్రి చలి తీవ్రతకు వణుకుతూ 55 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మతి స్థిమితం లేని వ్యక్తి జనరేటర్ తలుపు తీసి లోపలకు ప్రవేశిస్తున్న దృశ్యాలు కనిపించాయి. మృతదేహం పూర్తిగా ఉబ్బి గుర్తు పట్టలేని విధంగా మారింది. వీఆర్వో రాజారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అనంతపురం రెండో పట్టణ సీఐ శ్రీకాంత్‌యాదవ్ తెలిపారు.


