ఆంక్షలు.. అడ్డగింతలు | - | Sakshi
Sakshi News home page

ఆంక్షలు.. అడ్డగింతలు

Nov 17 2025 9:00 AM | Updated on Nov 17 2025 9:00 AM

ఆంక్ష

ఆంక్షలు.. అడ్డగింతలు

సాక్షి నెట్‌వర్క్‌:జిల్లాలో అరాచకం రాజ్యమేలుతోంది. టీడీపీ గూండాలు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. హిందూపురంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయ ధ్వంసమే ఇందుకు నిదర్శనం. ‘రెడ్‌బుక్‌’ పాలనలో వారు చెలరేగిపోతున్నా..పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారు. పైగా ప్రతిపక్ష పార్టీ నేతలపై నిర్బంధాలు విధిస్తూ.. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కునూ కాలరాస్తున్నారు. ‘పురం’ వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై శనివారం టీడీపీ అల్లరి మూకల దాడి నేపథ్యంలో ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి ఆదివారం ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి పలువురు ముఖ్య నేతలు బయలుదేరారు. అయితే..వారిని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ నిర్బంధించారు. హిందూపురం పట్టణంలో ర్యాలీలు, ధర్నాలు చేయకూడదని వైఎస్సార్‌సీపీ నియోజక వర్గ నేత వేణురెడ్డికి నోటీసులు అందించగా.. ఆయన అందుకు ఒప్పుకున్నా పార్టీ ముఖ్య నేతలను ‘పురం’లోకి అడుగుపెట్టనీయకుండా కట్టడి చేయడం ద్వారా ఖాకీలు తమ‘వైఖరి’ని బయటపెట్టుకున్నారు. హిందూపురం బయలుదేరిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డిని మార్గమధ్యంలోని కదిరిలో పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా ఆయన్ను పార్టీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి స్వగృహంలో నిర్బంధించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలిపే హక్కునూ ప్రభుత్వం కాలరాస్తోందని సతీష్‌రెడ్డి ధ్వజమెత్తారు.

కొట్నూరు వద్ద పోలీసుల ఓవరాక్షన్‌..

హిందూపురానికి వస్తున్న వైఎస్సార్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిలను హిందూపురం పట్టణ సమీపంలోని కొట్నూరు ఇందిరమ్మ కాలనీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు ఎవరూ హిందూపురంలోకి రాకుండా ఆదివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు అన్ని దారులనూ దిగ్బంధించారు. అనంత వెంకటరామిరెడ్డిని అనంతపురంలోని ఆయన స్వగృహం వద్దే టూటౌన్‌ సీఐ శ్రీకాంత్‌, పోలీసులు అడ్డుకున్నా.. వారి తీరుపై మండిపడ్డ ‘అనంత’ చివరకు హిందూపురం సమీపంలోని కొట్నూరు వద్దకు చేరుకోగా.. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌ గౌడ్‌, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్‌, పార్టీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, బూత్‌ కమిటీల జిల్లా అధ్యక్షుడు అమరనాథ రెడ్డి, క్రిస్టియన్‌ మైనార్టీ సెల్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జానీ తదితరులను పోలీసులు అడ్డుకున్నారు. పురంలోకి అనుమతించేది లేదని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి బస్సులో హిందూపురం వెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు కిందికి దించేశారు. అనంతరం ఎస్కార్టుతో అనంత, పెద్దారెడ్డి, ఇతర నేతలను అనంతపురం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అప్పటికే పెద్ద సంఖ్యలో స్థానిక కోర్టు రోడ్డుకు చేరుకున్న వైఎస్సార్‌ సీపీ శ్రేణులు రోడ్డు మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

పెనుకొండలో ఉషశ్రీ అడ్డగింత..

హిందూపురంలో పార్టీ కార్యాలయాన్ని పరిశీలించి.. కార్యకర్తలను పరామర్శించేందుకు జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్‌ ఆదివారం ఉదయం పెనుకొండ నుంచి బయల్దేరుతుండగా పోలీసులు అక్కడికి చేరుకుని గృహనిర్బంధం చేసేందుకు యత్నించారు. దీంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు పోలీసుల తీరును తప్పు పడుతూ నినాదాలు చేశారు. ఉషశ్రీచరణ్‌ హిందూపురం వెళ్లకుండా ఆమె కారును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పార్టీ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దాదాపు మూడు గంటలపాటు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. డీఎస్పీ నరసింగప్ప అక్కడికి చేరుకుని, శాంతిభద్రతలకు సహకరించాలని కోరడంతో ఉషశ్రీచరణ్‌ ఆగిపోయారు. నిరసన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీ నర్‌ బోయ నరసింహ, గోరంట్ల మండల కన్వీనర్‌ వెంకటేషులు, సోమందేపల్లి జెడ్పీటీసీ అశోక్‌, నాయకులు నాగలూరు బాబు, ప్రభాకర్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, శ్రీనివాసులు, మిల్ట్రీ బాషా, సి.నారాయణరెడ్డి, యాసిన్‌ తదితరులు పాల్గొన్నారు.

గృహ నిర్బంధాలు..

హిందూపురంలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళుతున్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని ఆదివారం స్థానిక టూ టౌన్‌ సీఐ రెడ్డెప్ప, పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కేతిరెడ్డి బయటకు రాకుండా గస్తీ నిర్వహించారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను అనంతపురంలోనే హౌస్‌ అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డికి నోటీసులిచ్చి ‘పురం’ వెళ్లకుండా చూశారు. కదిరి నియోజకవర్గ సమన్వయకర్త మక్బుల్‌ను మార్గమధ్యంలోనే అడ్డుకుని.. లేపాక్షి పోలీసుస్టేషన్‌కు తరలించారు.

పార్టీ కార్యాలయంపై దాడి నేపథ్యంలో పరిశీలనకు వస్తున్న వైఎస్సార్‌సీపీ

నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు

ఎమ్మెల్యే బాలకృష్ణ డైరెక్షన్‌లో

ప్రజాస్వామ్యం ఖూనీ

పోలీసుల తీరుపై మండిపడిన

వైఎస్సార్‌సీపీ నేతలు

కొట్నూరు వద్ద అనంత,

పెద్దారెడ్డి తదితరుల నిరసన

పెనుకొండలో రోడ్డుపై బైఠాయించిన మాజీ మంత్రి ఉషశ్రీ

ఆంక్షలు.. అడ్డగింతలు 1
1/4

ఆంక్షలు.. అడ్డగింతలు

ఆంక్షలు.. అడ్డగింతలు 2
2/4

ఆంక్షలు.. అడ్డగింతలు

ఆంక్షలు.. అడ్డగింతలు 3
3/4

ఆంక్షలు.. అడ్డగింతలు

ఆంక్షలు.. అడ్డగింతలు 4
4/4

ఆంక్షలు.. అడ్డగింతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement