యథేచ్ఛగా తవ్వకాలు.. రైతుల కంగారు
బొమ్మనహాళ్: కర్ణాటక–ఆంధ్రా సరిహద్దు వద్ద తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) పక్కనే మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. కాలువ గట్టుపై కన్నేసిన స్వార్థపరులు భారీ యంత్రాలతో తవ్వకాలు చేపడుతున్నారు. ఇప్పటికే వీరి నిర్వాకంతో అక్కడ పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. హెచ్చెల్సీ గట్టును ఆనుకొనే తవ్వుతుండడంతో స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో కాలువ బలహీనపడే ప్రమాదం ఉందని వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కర్ణాటక పరిధిలోని భూమిలో తవ్వుతున్నారనే నెపంతో మిన్నకుండిపోతున్నారు. హెచ్చెల్సీ అధికారులు కూడా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే తవ్వకాలను నిలిపివేయకపోతే ప్రమాదం తప్పదని రైతులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంపై బొమ్మనహాళ్ తహసీల్దార్ మునివేలును సంప్రదించగా.. ఆయన స్పందించారు. సరిహద్దులో హెచ్చెల్సీ పక్కన మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు ఆదివారం సాయంత్రం తన దృష్టికి వచ్చిందని, వెంటనే స్థానిక ఎస్‌ఐ దృష్టికి తీసుకెళ్లి మట్టి తవ్వకాలను నిలిపి వేయించామన్నారు. సోమవారం విచారణ చేసి కాలువ పక్కన మళ్లీ మట్టి తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇదే విషయమై బొమ్మనహాళ్ హెచ్చెల్సీ ఏఈఈ అల్తాఫ్ మాట్లాడుతూ మట్టి తవ్వకాలతో కాలువకే ప్రమాదం ఏర్పడుతుందన్నారు.కర్ణాటక అధికారుల దృష్టికి తీసుకెళ్లి మట్టి తవ్వకాలు జరపకుండా చూస్తామన్నారు.
హెచ్చెల్సీ సమీపంలోనే
మట్టి తవ్వకాలు
చేపడుతున్న స్వార్థపరులు
పట్టించుకోని అధికారులు
యథేచ్ఛగా తవ్వకాలు.. రైతుల కంగారు


