కుక్కల దాడి.. 15 గొర్రెల మృతి
పెద్దపప్పూరు: వీధి కుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి చెందాయి. పెద్దపప్పూరు మండలం అమ్మలదినెన్న గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జీవాల పోషణతో జీవనం సాగిస్తున్న గ్రామానికి చెందిన పుట్టయ్య యాదవ్.. ఆదివారం రాత్రి తన ఇంటి సమీపంలోని షెడ్డులో గొర్రెలను వదిలి, ఇంట్లో నిద్రించాడు. ఆదివారం తెల్లవారుజామున షెడ్డులోకి చొరబడిన వీధి కుక్కలు 15 గొర్రెలను కొరికి చంపేశాయి. ఘటనతో దాదాపు రూ.2 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాదితుడు వాపోయాడు. విషయం తెలుసుకున్న పశువైద్యాధికారి డాక్టర్ సువర్ణ, ఆర్‌బీకే సిబ్బంది ఆ గ్రామానికి చేరుకుని పరిశీలించారు. బాధితుడికి పరిహారం అందేలా చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా వారికి సీపీఐ, సీపీఎం నాయకులు విన్నవించారు.
యువకుడి దుర్మరణం
తాడిపత్రి రూరల్: గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గుమ్మఘట్ట మండలం దేవరెడ్డిపల్లికి చెందని వరప్రసాద్ నాయక్ (28) బంధువులు తాడిపత్రి మండలం చుక్కలూరు క్రాస్‌లోని బండల పాలీస్ యూనిట్‌లో కార్మికులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వారితో కలసి ఉపాధి పొందడానికి నాలుగు నెలల క్రితం తాడిపత్రికి చేరుకున్న వరప్రసాద్ నాయక్.. స్థానికంగా పెయింటింగ్ పనులతో జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాత్రి చుక్కలూరు – సజ్జలదిన్నె రోడ్డపై నడుచుకుంటూ వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనంతో సహా ఉడాయించాడు. ఘటనపై తాడిపత్రి అప్‌గ్రేడ్ పీఎస్ సీఐ శివగంగాధరరెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
కారును ఢీకొన్న ఐచర్
యాడికి: ఎదురుగా వస్తున్న కారును ఐచర్ ఢీకొని రోడ్డుకు అడ్డంగా బోల్తాపడింది. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. యాడికి మండలం రాయలచెరువులోని గుత్తికి వెళ్లే మార్గంలో కరుణాకర్ రైస్ మిల్లు ఎదురుగా ఈ ఘటన చోటు చేసుకుంది. గుత్తి వైపుగా వెళుతున్న లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఐచర్ వాహనం.. గుంతకల్లు నుంచి తాడిపత్రికి వెళుతున్న కారును ఢీకొని బోల్తాపడింది. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న భార్య, భర్తతో పాటు డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఐచర్ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న సీఐ ఈరన్న అక్కడుక చేరుకుని పరిశీలించారు. రోడ్డుకు అడ్డుగా పడిన ఐచర్ వాహనాన్ని పక్కకు లాగించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
కుక్కల దాడి.. 15 గొర్రెల మృతి
కుక్కల దాడి.. 15 గొర్రెల మృతి


