విత్తుకు వేళాయే... విత్తనం లేదాయే!
అనంతపురం అగ్రికల్చర్: రబీలో పప్పుశనగ తర్వాత రెండో ప్రధానపంటగా వేరుశనగకు ఉమ్మడి జిల్లా రైతులు సిద్ధమయ్యారు. ఈ రబీలో 18 వేల హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశనగ సాగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ నెల 15 నుంచి డిసెంబర్ 15 లోపు వేరుశనగ సాగుకు అనువైన సమయమని శాస్త్రవేత్తలు ప్రకటించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం రైతులకు రాయితీ విత్తనాలు ఇవ్వలేకపోతోంది. గత ఖరీఫ్‌లో చాలా ఆలస్యంగా అరకొరగా వేరుశనగ ఇచ్చిన ప్రభుత్వం ఈ రబీలో ప్రధాన పంట పప్పుశనగ విత్తుకునే సమయం చివరి దశకు చేరకున్న తర్వాత కేవలం 1,200 క్వింటాళ్లు మాత్రమే రాయితీ విత్తనం ఇచ్చి చేతులు దులుపుకుంది. ప్రస్తుతం వేరుశనగ విత్తుకునే సమయం వచ్చినా ఇప్పటికీ విత్తనాన్ని అందుబాటులో తీసుకురాలేదు. ఉమ్మడి జిల్లాకు 15 వేల క్వింటాళ్లు కేటాయించారు. కానీ రాయితీలు, ధరలు, పంపిణీ ఎప్పుడనేది మాత్రం ప్రకటించలేదు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా నీటి వసతి కింద 22కి పైగా మండలాల్లో 1,000 హెక్టార్ల విస్తీర్ణంలో విత్తు వేశారు. నెలాఖరులోపు విత్తుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. అయినా సర్కారు మాత్రం విత్తనం ఇవ్వకుండా నాన్చుడి ధోరణి అవలంభిస్తోంది. 2024 రబీలోనూ విత్తన వేరుశనగ ఇసామని ఊరించి చివరకు ఇవ్వకుండా మోసం చేశారు. దీంతో గతేడాది 20 వేల హెక్టార్లు అంచనా వేయగా... విత్తనం అందుబాటులో లేక కేవలం 10 వేల హెక్టార్లకు మాత్రమే రబీ సాగు పరిమితమైంది. మొత్తమ్మీద కరువు మండలాలు, ఇన్‌పుట్, ఇన్సూరెన్స్ ఇవ్వకుండా రైతులను అడుగడుగునా మోసపుచ్చుతున్న చంద్రబాబు ప్రభుత్వం కనీసం రాయితీ విత్తనం కూడా ఇవ్వకుండా దగా చేస్తుండటంతో రైతులు మండిపడుతున్నారు.
రబీ పంటగా 18 వేల హెక్టార్లలో
వేరుశనగ సాగు అంచనా
ఉమ్మడి జిల్లాకు 15 వేల క్వింటాళ్ల కేటాయింపు
క్షేత్రస్థాయిలో కనిపించని
విత్తన వేరుశనగ


