లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు
పెద్దవడుగూరు: జాతీయరహదారిపై నిల్చున్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. వివరాల్లోకెళితే... టీవీకే ట్రావెల్స్‌కు చెందిన ఎన్‌ఎల్ 018 2229 నంబరు గల ప్రైవేట్ బస్సు శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు బయల్దేరింది. శనివారం తెల్లవారుజామున పెద్దవడుగూరు మండలం కాశేపల్లి టోల్ ప్లాజా దాటిన అనంతరం రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బస్సు వేగంగా ఢీకొంది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురై గట్టిగా కేకలు వేశారు. అప్రమత్తమైన స్థానికులు బస్సులోని ప్రయాణికులను బయటకు దింపి మరొక వాహనంలో పంపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గురైన బస్సును పక్కకు తీయించి ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూశారు. ప్రయాణికులకు ఎవ్వరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై ఇప్పటి వరకు ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడి
గుత్తి: వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై టీడీపీ నాయకుడు రౌడీ మూకలతో దాడి చేయించిన ఘటన గుత్తిలో చోటు చేసుకుంది. బాధితుని కథనం మేరకు... పట్టణంలోని బాలాజీ లాడ్జి సమీపంలో మస్తాన్ అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్త రోడ్డు పక్కన పూలబండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఆ పక్కనే టీడీపీ నాయకుడు నౌషద్‌కు చెందిన దుకాణం ఉంది. శనివారం నౌషద్ అనంతపురం నుంచి ఏడుగురు రౌడీమూకలను కారులో పిలిపించాడు. వారు వచ్చీ రాగానే మస్తాన్‌తో అకారణంగా గొడవ పెట్టుకున్నారు. పూలబండిని, బీడీల బాక్సుతో పాటు బైకును కిందపడేసి ధ్వంసం చేశారు. అనంతరం కట్టెలతో మస్తాన్‌ను చావబాదారు. స్థానికులు వచ్చి విడిపించి బాధితుడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నౌషద్‌తో ఎటువంటి గొడవలూ లేవని, మనసులో ఏదో పెట్టుకునే తనపై దాడి చేయించాడని మస్తాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కారుతో యువకుడి హల్‌చల్
పామిడి: ఓ యువకుడు కారు నడుపుతూ రోడ్డుపైకొచ్చి హల్‌చల్ చేశాడు. వాహనాన్ని నియంత్రించలేక ఎదురుగా వచ్చిన ద్విచక్రవాహనాలను ఢీకొనడంతో నలుగురు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. పామిడికి చెందిన మణి అనే యువకుడు శనివారం రాత్రి బీసీసీ రోడ్డు సమీపంలోని ఓ గ్యారేజీ నుంచి ఏపీ 40 హెచ్‌ఈ 2774 నంబరు గల కారును తీసుకుని రోడ్డుపైకొచ్చాడు. డ్రైవింగ్‌పై పట్టులేని ఆ యువకుడు సంజీవ బండల షాపువద్ద గార్లదిన్నె మండలం కల్లూరుకు చెందిన పురుషోత్తమ్, బాబా ఫక్రుద్దీన్‌ను ఢీకొనడంతో వారు గాయాలపాలయ్యారు. భయంతో కారు ఆపకుండా ముందుకు దూసుకొచ్చే క్రమంలో ఈద్గా మసీదు వద్ద ద్విచక్రవాహనంపై వస్తున్న ఎల్‌ఐసీ ఏజెంట్ ఖాజాహుసేన్‌తో పాటు, ఐదేళ్ల చిన్నారిని ఢీకొట్టాడు. దీంతో వారిద్దరూ గాయపడ్డారు. అనంతరం కారు ఆగిపోవడంతో కిందకు దిగి వచ్చిన యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
అర్చకుడికి ‘తమ్ముళ్ల’ బెదిరింపులు
శింగనమల: స్థానిక దుర్గాంజనేయ దేవాలయ పూజారి రమణకు తెలుగు తమ్ముళ్ల నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని అర్చకుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆలయంలో కొన్నేళ్లుగా ఆగమశాస్త్రం ప్రకారం పూజలు నిర్వహిస్తున్న తమను అవమానించి, దేవాలయం నుంచి బయటకు పంపడానికీ చూస్తున్నారని ఆరోపించారు. వారి బెదిరింపుల కారణంగా బయటకు రాలేకపోతున్నామని అవేదన వ్యక్తం చేశారు. తనకు ఏదైనా జరిగితే సదరు ‘తెలుగు తమ్ముళ్లే’ కారణమని స్పష్టం చేశారు.
లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు
లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు
లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు


