శోత్రియం భూముల అన్యాక్రాంతంపై రైతుల ఆగ్రహం
శెట్టూరు: శోత్రియం భూముల అన్యాక్రాంతంపై సాగుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములను కాపాడాలని శనివారం వందమంది రైతులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వే నంబర్ 172–1లోని మూడు ఎకరాల్లో శాశ్వత నివాసాలు, గుడి, చర్చిలు ఉన్నాయన్నారు. అలాగే సర్వే నంబర్ 285, 16, 179–5, 119, 139–1, 293–2, 275–2లోని భూములను 40 ఏళ్లుగా తాము సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. అయితే తమకు తెలియకుండా టీడీపీ నేత సుధాకరశెట్టి, ఆయన కుటుంబానికి చెందిన బాబుప్రసాద్‌లు తమ అనుభవంలో ఉన్న భూములు, స్థలాలను అక్రమంగా చేయించుకుని, ఇతరులకు అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. సుధాకర శెట్టి కుటుంబ సభ్యులు గ్రామంలో ఉన్న కుంట, వంక, ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేశారని తహసీల్దార్ ఈశ్వరమ్మ ఎదుట బోరున విలపించారు. 2008 సంవత్సరంలో పలువురు రైతులకు ప్రభుత్వం ఇంటి పట్టాలు మంజూరు చేసిందని, ఏడో విడత భూ పంపిణీలో సుమారు 20 మందికి డీ పట్టాలు మంజూరు చేసిందని, వీటిని కూడా సుధాకర శెట్టి కుటుంబానికి రెవెన్యూ అధికారులు కట్టబెట్టారన్నారు. రెవెన్యూ అధికారులు గ్రామంలో పర్యటించి సాగులో ఉన్న తమకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మంజునాథ, రైతులు పూజారి తిమ్మన్న, పూజారి పాలయ్య, వడ్డే నాగరాజు, వడ్డే సుబ్బరాయుడు, రామాంజనమ్మ, పాలమ్మ, ఎస్.వై.లింగప్ప, గిరిజమ్మ, స్వామి, పుట్టంపుర్ల గోవింద, ప్రభు , పగటి వేశగాళ్ళ ఎర్రిస్వామి, శేఖర్, కోటగుడ్డ మంజునాథ, వడ్డే హనుమంతు, బొమ్మలాట రవి, ముచ్చర్లపల్లి నరసింహులు, మారజ్జప్ప, నరసింహ, రాజప్ప తదితరులు పాల్గొన్నారు.


