సర్కార్ తీరుతో నష్టపోతున్న రైతులు
● కరువు మండలాల ప్రకటనలో
జిల్లాకు తీవ్ర అన్యాయం
అనంతపురం అర్బన్: కరువు మండలాల ప్రకటనలో జిల్లాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేశాయని, ఫలితంగా రైతులు నష్టపోతున్నారంటూ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం స్థానిక ఆ సంఘం కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఖరీఫ్‌లో సకాలంలో వర్షాలు కురవక సాగు చేసిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాలోని మండలాలను కరువు జాబితాలో చేర్చకుండా రైతులు, రైతు కూలీలకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. జూలై ఆఖరు, ఆగస్టులో కురిసిన వర్షాలకు దిగుబడులు పూర్తి తగ్గి పెట్టుబడులు కూడా చేతికి అందక రైతులు అప్పుల పాలయ్యారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 31 మండలాలను కరువు జాబితాలో చేర్చి పంట నష్టపోమయిన రైతులకు పరిహారం, బీమా ప్రకటించాలని డిమాండ్ చేశారు.


