జేసీ అనుచరుల రౌడీయిజం
అనంతపురం/తాడిపత్రిటౌన్: తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులు మరోసారి రెచ్చిపోయారు. రౌడీల్లా మారి వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులకు తెగబడ్డారు. తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తే మీ అంతు చూస్తాం.. అంటూ వీరంగం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి సర్కారు ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కోటిసంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆ పార్టీ నాయకులు కంచెం రామ్మోహన్ రెడ్డి, గడ్డం పరమేష్ తదితరులు ఆదివారం తాడిపత్రిలోని పాతకోట, పోరాటకాలనీల్లో నిర్వహించారు. అక్కడికి చేరుకున్న ఎస్‌ఐ గౌస్ మహమ్మద్ అనుమతి లేకుండా ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణులపై రెచ్చిపోయారు. కార్యక్రమాన్ని నిలిపేయాలని అడ్డగించారు. ఇంతలోనే జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులైన మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్షావలి, టీడీపీ కౌన్సిలర్లు మల్లికార్జున, జింకా లక్ష్మీదేవితో పాటు నేరచరితగల పలువురు వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. అక్కడే ఉన్న ఎస్‌ఐ గౌస్ మహమ్మద్ వారిని వారించకపోగా.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపైనే చేయిచేసుకున్నారు. కార్యక్రమాన్ని అర్ధంతరంగా నిలిపేయించారు. తర్వాత వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఇళ్లకు తిరిగి వెళుతుండగా.. జేసీ అనుచరులు మరోసారి రెచ్చిపోయారు. మూడు వాహనాలపై రాళ్లవర్షం కురిపించారు. ఈ రాళ్లదాడిలో ఒక వాహనం వెనుకవైపు అద్దాలు పగిలిపోయాయి. వైఎస్సార్‌సీపీ కార్యకర్త సుభాష్‌కు గాయాలయ్యాయి.
పథకం ప్రకారమే దాడులు..
కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని తాడిపత్రి భగత్‌సింగ్ కాలనీలో నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ నాయకులు తొలుత నిర్ణయించారు. దీనిపై టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జున ఇంటింటికీ వెళ్లి ఆ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. దీన్ని పసిగట్టిన వైఎస్సార్‌సీపీ నాయకులు గొడవ వద్దనుకుని పాతకోట, పోరాటకాలనీకి కార్యక్రమాన్ని మార్చుకున్నారు. అయినా జేసీ వర్గీయులు అక్కడ కూడా విధ్వంసానికి దిగారు. కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించినా దాడులు చేయాలని జేసీ వర్గీయులు ముందే పథకం రూపొందించుకున్నట్లు స్పష్టమవుతోంది. తాడిపత్రిలో నిత్యం అలజడులు సృష్టిస్తూ టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి రాక్షసానందం పొందుతున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
టీడీపీ నాయకులపై ఫిర్యాదు..
కోటి సంతకాల సేకరణ సందర్భంగా దాడికి పాల్పడిన టీడీపీకి చెందిన నలుగురు మునిసిపల్ కౌన్సిలర్లతో పాటు 25 మంది టీడీపీ నాయకులపై వైఎస్సార్‌సీపీ వార్డు ఇన్‌చార్జ్ ఎరుకల రామాంజినేయులు పట్టణ సీఐ ఆరోహణరావుకు ఫిర్యాదు చేశారు. టీడీపీ కౌన్సిలర్లు మల్లికార్జున, జింకా లక్ష్మీదేవి, హాజీవలి, షేక్షాతో పాటు ఆ పార్టీ నాయకులు రఘు, శంకర్, పాతకోట బబ్లూ, డిష్‌రాజు, బూర్గల రాము, ఓట్ల ప్రసాద్, పాతకోట షబ్బీర్, పోరాటకాలనీ పెద్దయ్యతో పాటు మరికొందరు అసభ్య పదజాలంతో, కులం పేరుతో దూషిస్తూ రాళ్లదాడికి తెగబడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు నేపథ్యంలో విచారణ చేపడుతున్నామని సీఐ ఆరోహణరావు ‘సాక్షి’కి తెలిపారు.
తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ చేపట్టిన
కోటిసంతకాల సేకరణకు ఆటంకాలు
నాయకుల వాహనాలపై రాళ్ల దాడి
జేసీ వర్గీయులకే వత్తాసు
పలికిన పట్టణ ఎస్‌ఐ
జేసీ అనుచరుల రౌడీయిజం


