రాచూరీ.. ఫోర్జరీ!
రాప్తాడురూరల్: రూ. వేల కోట్ల విలువైన పాపంపేట శోత్రియం భూముల కబ్జా వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భూములు తమవంటూ చెప్పుకునే వ్యక్తి వీఆర్‌ఓ సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించిన రెవెన్యూ అధికారులు ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.వివరాలు.. పాపంపేట భూములకు సంబంధించి వీఆర్‌ఓ, మండల సర్వేయర్ జారీ చేసిన పొజిషన్ సర్టిఫికెట్లు అంటూ రాచూరి కుటుంబ సభ్యులు, వారిద్వారా జీపీఏలు చేయించుకున్న వెంకటచౌదరి, శ్రీరాములు తదితరులు మ్యుటేషన్ కోసం హైకోర్టులో కేసు వేశారు. అయితే, 2024 ఆగస్టు 13వ తేదీతో 29.96 ఎకరాలకు సంబంధించి జారీ చేసిన ఆరు పొజిషన్ సర్టిఫికెట్లతో తనకు సంబంధం లేదని, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని వీఆర్‌ఓ రఘు యాదవ్ చెబుతున్నా పైఅధికారులకు కాని, ఇటు పోలీసులకు కాని రాతపూర్వకంగా ఫిర్యాదు చేయకపోవడం అనుమానాలకు తావిచ్చింది.
అధికారులపై ఒత్తిళ్లు..
కబ్జా వ్యవహారంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీ ముందునుంచి బాధితులకు అండగా నిలిచింది. ఇటీవల రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి బాధితులను వెంటబెట్టుకుని కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె కుమారుల అండతోనే భూములను కబ్జా చేసే ప్రయత్నం జరుగుతోం దంటూ మీడియా సమావేశాలు పెట్టి వివరించారు. అలాగే సీపీఐ, సీపీఎం, బీజేపీ, లోక్‌సత్తా పార్టీలు, పలు ప్రజాసంఘాల నాయకులు కూడా బాధితులకు మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ క్రమంలో పాపంపేట భూముల కబ్జా వ్యవహారం రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
కలెక్టర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం..
వీఆర్‌ఓ సంతకం ఫోర్జరీ అంశంపై ఇటీవల కొందరు బాధితులు నేరుగా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఆయన క్రిమినల్ కేసు నమోదుకు ఆర్డీఓకు ఆదేశాలు జారీ చేశారు. రోజులు గడుస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో శనివారం మరోమారు బాధితులు కలెక్టర్‌ను కలిసి విన్నవించారు. వెంటనే ఆర్డీఓ కేశవనాయుడుకు ఫోన్ చేసిన కలెక్టర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. క్రిమినల్ కేసు నమోదు చేయకపోతే మీపై చర్యలుంటాయంటూ హెచ్చరించినట్లు సమాచారం. దీంతో హుటాహుటిన ఆర్డీఓ, తహసీల్దార్ సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. వీఆర్‌ఓ సంతకం ఫోర్జరీ చేసి వివాదానికి కారణమైన రాచూరి వెంకటకిరణ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎట్టకేలకు ఆర్డీఓ శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనంతపురం రూరల్ పోలీసులు 340 (2), 518 (4) సెక్షన్ల కింద 225/2025గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పాపంపేట భూ బాగోతంలో
కీలక పరిణామం
వీఆర్‌ఓ సంతకం ఫోర్జరీ
ఆర్డీఓ ఫిర్యాదుతో పోలీస్‌స్టేషన్‌లో కేసు


