నేడు పరిష్కార వేదిక
అనంతపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు.సమస్యపై గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. meekosam.ap. gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లోనూ అర్జీ సమర్పించవచ్చని తెలిపారు.
వేతనాలు నిలుపుదల చేస్తాం
అనంతపురం టౌన్: ఉపాధి హామీ పథకంలో బోగస్ మస్టర్లతో నిధులను కొల్లగొడుతున్న వైనంపై ‘ఉపాధిని ఊడ్చేస్తున్నారు’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో వెలువడిన కథనంపై జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సలీం బాషా స్పందించారు. ఏపీఓలతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి అక్రమాలు చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయా గ్రామాల్లో ఉపాధి వేతన బిల్లులను నిలుపుదల చేయాలని ఏపీఓలను ఆదేశించామన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని సూచించామన్నారు. బోగస్ మస్టర్లు సృష్టిస్తే ఫీల్ అసిస్టెంట్లను ఇంటికి పంపుతామని ఆయన హెచ్చరించారు.
కూలిన హెచ్చెల్సీ
హెడ్ రెగ్యులేటర్
బొమ్మనహాళ్: బొమ్మనహాళ్ సెక్షన్ పరిధిలోని తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) 116.399 కిలోమీటర్ వద్ద హెడ్ రెగ్యులేటర్ ఆదివారం రాత్రి కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. హెచ్చెల్సీపై హెడ్ రెగ్యులేటర్ నిర్మించి చాలా ఏళ్లు కావడంతో ఇటీవల శిథిలావస్థకు చేరుకుంది. హెచ్చెల్సీ అధికారులు కూడా మరమ్మతుల గురించి పట్టించుకోకపోవడంతో హెడ్ రెగ్యులేటర్ గేట్లు పూర్తిగా తుప్పు పట్టిపోయాయి. ప్రస్తుతం హెచ్చెల్సీలో పూర్తిస్థాయిలో నీరు ప్రవహిస్తుండటంతో ఉధృతికి హెడ్ రెగ్యులేటర్, దానికి అమర్చిన నాలుగు గేట్లలో మూడు నీటిలో కొట్టుకుపోయినట్లు తెలిసింది.
మృత్యువులోనూ తోడుగా..
ఓడీచెరువు (అమడగూరు): జీవితాంతం కలిసి ఉంటా మని పెళ్లినాడు చేసిన బాసలు.. మరణానంతరం కూడా కొనసాగించారు ఆ దంపతులు. వివరాలిలా ఉన్నాయి. అమడగూరు మండలం జౌకలకొత్తపల్లికి చెందిన దండు వెంకటరమణ (75), దండు చిన్నపాపమ్మ (68) దంపతులు. వీరికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. వయోభారంతో వెంకటరమణ శనివారం రాత్రి చనిపోయాడు. భర్త మరణంతో మనోవేదనకు గురైన దండు చిన్నపాపమ్మ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచింది. వీరి అన్యోన్య దాంపత్యం మృత్యువులోనూ వీడని బంధంగా నిలిచింది. తల్లి, తండ్రి కొన్ని గంటల వ్యవధిలోనే మరణించడంతో కుమారులు, కుమార్తెలు విషాదంలో మునిగిపోయారు.
నేడు పరిష్కార వేదిక


