చంద్రబాబువి డైవర్షన్ పాలిటిక్స్
ఉరవకొండ/వజ్రకరూరు: డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వం మాజీ మంత్రి జోగి రమేష్‌ను అరెస్టు చేయించిందని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఉరవకొండలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంతో పాటు వజ్రకరూరు మండలం కమలపాడులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ‘విశ్వ’ మాట్లాడారు. కూటమి సర్కారు వైఫల్యంతోనే శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఆలయం దేవదాయ శాఖ పరిధిలోకి రాదంటూ మంత్రి మాట్లాడడం దారు ణమన్నారు. సింహాచలం, తిరుపతిలో తొక్కిసలాట జరిగి భక్తులు మరణించిన విష యాన్ని మరువకనే మళ్లీ ఇప్పుడు ఇలా జరగడం కలచివేస్తోందన్నారు. ఈ క్రమంలోనే తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీశారని ఆరోపించారు. నకలీ మద్యం తయారీ మొత్తం టీడీపీ నేతల కనుసన్నల్లోనే జరిగిందన్నారు. ఇందులో ప్రధాన సూత్రధారిగా ఉన్న జయచంద్రారెడ్డిని పోలీసులు అరెస్టు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. కేసులో నిందితుడైన జనార్దన్‌రావుతో తప్పుడు వాంగ్మూలం ఇప్పించి జోగి రమేష్‌ను అరెస్టు చేయించారన్నారు. ‘దొంగే.. దొంగ దొంగ’ అన్న చందంగా చంద్రబాబు తీరు ఉందని దుయ్యబట్టారు. వ్యవసాయం దండగ అన్న ధోరణిలోనే చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. వైఎస్సార్ సీపీ హయాంలో ప్రభుత్వమే పంటల బీమా ప్రీమియం చెల్లించి రైతులకు అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమి పాలనలో రైతులే ప్రీమియం చెల్లించుకోవాలని ఉన్నట్లుండి ప్రకటించడంతో చాలా మంది కట్టలేదన్నారు. గతంలో 84 లక్షల మంది రైతులకు ఇన్సూరెన్సు ప్రీమియం చెల్లించగా, ఈ ఏడాది కేవలం19 లక్షల మంది చెల్లించడమే ఇందుకు నిదర్శనమన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. పప్పుశనగ విత్తనాలను సకాలంలో అందించకపోవడంతో రైతులే సొంతంగా సమకూర్చుకుని పంట సాగు చేశారని, ఇప్పుడు రాయితీతో విత్తనాలు ఇవ్వడానికి సిద్ధమవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువుకు మారుపేరుగా ఉన్న జిల్లాలో ఒక్క మండలాన్ని కూడా కరువు జాబితాలో చేర్చకపోవడం దారుణమన్నారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న,వైస్ ఎంపీపీ ఈడిగప్రసాద్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి సందీప్‌రెడ్డి, బీసీ సెల్ జిల్లా నాయకుడు అల్లెప్ప, మండల ఉపాధ్యక్షుడు ఉస్మాన్, రైతు విభాగం అధ్యక్షుడు భరత్‌రెడ్డి, పార్టీ నాయకులు ఓబన్న, ఆమిద్యాల రాజేష్, మల్లి, చంద్రశేఖర్, లక్ష్మినారాయణరెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి, నాగేష్, నారాయణనాయక్, ప్రకాష్‌రెడ్డి, రమేష్, మహబూబ్‌పీరా, కిరణ్ పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు
వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజం


