1.50 లక్షల మెట్రిక్ టన్నుల అరటి ఎగుమతులు
అనంతపురం అగ్రికల్చర్: రైతులకు మేలు జరిగేలా ఈ ఏడాది జిల్లా నుంచి 1.50 లక్షల మెట్రిక్ టన్నుల అరటి విదేశాలకు ఎగుమతి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఉద్యానశాఖ కమిషనరేట్ జేడీ దేవమునిరెడ్డి ఆదేశించారు. శనివారం స్థానిక ఉద్యానశాఖ కార్యాలయంలో డీడీహెచ్ డి.ఉమాదేవి, ఏడీహెచ్ దేవానంద్‌తో కలిసి హెచ్‌వోలతో సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 13 వేల హెక్టార్ల విస్తీర్ణంలో అరటి సాగులో ఉన్నందున.. అందులో 1,500 హెక్టార్ల తోటల నుంచి 1.50 లక్షల మెట్రిక్ టన్నుల నాణ్యమైన అరటి గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కార్పొరేట్ కంపెనీలు, రైతు ఉత్పత్తి సంఘాల సహకారంతో ఎంపిక చేసిన ప్రాంతాల్లో రైతులు మేలైన యాజమాన్య పద్ధతులు, సాంకేతిక పద్ధతులు పాటించి నాణ్యమైన అరటి పండించేలా ప్రోత్సహించాలన్నారు. ఫ్రూట్ కేర్ యాక్టివిటీ అమలు చేసే ఎఫ్‌పీఓలకు హెక్టారుకు రూ.25 వేలు రాయితీ వర్తింపజేస్తామని తెలిపారు. తాడిపత్రి నుంచి ఏసీ కంటైనర్ వ్యాగన్ల ద్వారా నేరుగా విదేశాలకు అరటి ఎగుమతులు జరిగేలా చూడాలన్నారు. తద్వారా రైతులకు మంచి గిట్టుబాటు ధరలు లభిస్తాయన్నారు. భవిష్యత్తులో ఎగుమతులు మరింత పెరిగేలా కక్కలపల్లి టమాటా మండీ మాదిరిగా అనంతపురం పరిసర ప్రాంతాల్లో అరటి కలెక్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తే మార్కెటింగ్ సదుపాయం పెరిగి రైతులకు లాభదాయకంగా మారుతుందని తెలిపారు. డిసెంబర్ నుంచి అరటి ఎగుమతులు మొదలు పెట్టడానికి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని ఆదేశించారు. అనంతరం నార్పల మండలంలో క్షేత్రస్థాయి ప్రదర్శన కింద అరటి తోటలను పరిశీలించారు.


