ఉపాధిని ఊడ్చేస్తున్నారు!
● ఆత్మకూరు మండలం వడ్డుపల్లి పంచాయతీలో చేపడుతున్న ఉపాధి పనుల్లో 10 మంది శ్రామికుల ఫొటోను 14 మస్టర్లకు నమోదు చేశారు. శ్రామికులను అటు ఇటుగా మార్చి యాప్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ రెండే కాదు.. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి.
అనంతపురం టౌన్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఫీల్డ్ అసిస్టెంట్లకు వరంగా మారింది. పనులకు రాని వారిని సైతం వచ్చినట్లు మస్టర్లలో నమోదు చేస్తూ ఉపాధి నిధులను కొల్లగొట్టేస్తున్నారు. కూలీల హాజరును పెద్ద ఎత్తున నమోదు చేస్తూ వారికి వచ్చే బిల్లుల్లో 50 శాతం చొప్పున తీసుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. అధికారులు కూడా మస్టర్లను పరిశీలించకుండానే ఆమోదం తెలుపుతుండడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.
‘పచ్చ’ నేతల అండ
జిల్లా వ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు కూటమి నేతల అండ మెండుగా ఉండడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. శింగనమల నియోజకవర్గంలోని చాలా గ్రామ పంచాయతీల్లో ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు అధికారులను సైతం లెక్కచేయని పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఉపాధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించే సాహసం కూడా అధికారులు చేయడం లేదని తెలిసింది. ఇటీవల బుక్కరాయసముద్రం మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్ల అక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే అండగా ఉన్నారంటూ టీడీపీ నాయకులే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
మస్టర్లు పరిశీలిస్తే అక్రమాలు బయటికి..
ఉపాధి హామీ పథకంలో రోజువారీగా పనులకు హాజరైన శ్రామికుల పేర్లను, ఫొటోలను ఎన్‌ఎంఎంఎస్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. వాటిని పరిశీలిస్తే ఫీల్డ్ అసిస్టెంట్లు చేస్తున్న మోసాలు, అక్రమాలు ఇట్టే బయటపడతాయని పలువురు చెబుతున్నారు. అధికార యంత్రాంగం ఈ మేరకు చర్యలు తీసుకుంటుందో లేదో వేచి చూడాలి.
చెన్నంపల్లిలో ఒకే ఫొటోను పలు మస్టర్లలో నమోదు చేసిన దృశ్యాలు
పనులకు వచ్చేది తక్కువ..
మస్టర్లలో చూపేది ఎక్కువ
ఒకే ఫొటోను మార్చి మార్చి నమోదు
కూటమి నేతల అండదండలతో కొల్లగొడుతున్న వైనం
బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో అక్టోబర్ 11న చేపట్టిన ఉపాధి పనులకు 209 మంది శ్రామికులు హాజరైనట్లు మస్టర్లలో నమోదు చేశారు. ఎన్‌ఎంఎంఎస్ యాప్‌లో ఒకే ఫొటోను పలుమార్లు అప్‌లోడ్ చేశారు. 20 మంది కూలీల ఫొటోను అటు ఇటుగా మార్చి 22 మస్టర్లకు నమోదు చేశారు. ఇప్పటికే పలుమార్లు అధికారులు ఈ విషయాన్ని గుర్తించినా స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్‌పై మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆ ఫీల్డ్ అసిస్టెంట్‌కు అధికార పార్టీ నాయకుల మద్దతు మెండుగా ఉండడంతోనే అధికారులు మిన్నకుండిపోతున్నట్లు తెలిసింది.
చర్యలు తీసుకుంటాం
ఫీల్డ్ అసిస్టెంట్లు ఎన్‌ఎంఎంఎస్ యాప్‌లో నమోదు చేస్తున్న మస్టర్లను పూర్తి స్థాయిలో పరిశీలిస్తాం. ఒకే ఫొటోను మస్టర్లలో నమోదు చేసి ఉపాధి నిధులను పక్కదారి పట్టిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటాం. – సలీం బాషా, డ్వామా పీడీ
ఉపాధిని ఊడ్చేస్తున్నారు!


