ఆలయంలో అపచారం
● నార్పల మారెమ్మ గుడిలో
మందుబాబుల హల్‌చల్
● ఆలయంలోనే మద్యం తాగి,
అమ్మవారి విగ్రహం పగులగొట్టిన వైనం
శింగనమల(నార్పల):నార్పల మండల కేంద్రంలోని మారెమ్మ ఆలయంలో అపచారం జరిగింది. శుక్రవారం రాత్రి మందుబాబులు మారెమ్మ ఆలయ తాళం పగులగొట్టి, గుడిలోకి వెళ్లి మారెమ్మ విగ్రహం ముక్కును ధ్వంసం చేశారు. అక్కడే మద్యం సేవించారు. వస్తువులు చెల్లాచెదురుగా పడేశారు. అనంతరం హుండీని ఎత్తుకెళ్లారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సాగర్ శనివారం మారెమ్మ గుడిని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను పట్టుకుంటామని తెలిపారు.
బెంబేలెత్తుతున్న ప్రజలు..
నార్పలలో ఇటీవల మందుబాబుల ఆగడాలు పెరిగిపోయాయి. బెల్టుషాపులు విచ్చలవిడిగా ఏర్పాటు కావడంతో పూటుగా మద్యం తాగి అకృత్యాలకు పాల్పడుతున్నారు. మద్యం మత్తులో మహిళలపై వేధింపులకు దిగుతున్నారు. మద్యం తాగి చోరీలకు సైతం పాల్పడుతుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత శింగనమల నియోజకవర్గంలో శాంతిభద్రతలు క్షీణించాయి. అసాంఘిక కార్యకలాపాలు అధికమయ్యాయి. ఎక్కడపడితే అక్కడ బెల్టుషాపులు వెలిశాయి. నార్పలలో వరుస సంఘటనలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆకతాయిలు మారెమ్మ గుడిలోనే మద్యం తాగడం మరీ దారుణం. ఎకై ్సజ్ శాఖ, పోలీస్ వ్యవస్థ విఫలమయ్యాయి.
–నార్పల సత్యనారాయణరెడ్డి,
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి
ఆలయంలో అపచారం


