పారదర్శకంగా పింఛన్ల పంపిణీ
● కలెక్టర్ ఆనంద్
రాప్తాడురూరల్/అనంతపురం సిటీ: అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా సామాజిక పింఛన్లు పంపిణీ చేయాలని కలెక్టర్ ఓ .ఆనంద్ ఆదేశించారు. శనివారం అనంతపురం రూరల్ మండలం కురుగుంట వైఎస్సార్ కాలనీలో పలువురికి ఎన్టీఆర్ భరోసా పథకం పింఛన్లు పంపిణీ చేశారు. జిల్లాలో 2,97,363 మంది లబ్ధిదారులకు సుమారు రూ.124.84 కోట్లు అందిస్తున్నట్లు తెలిపారు. పలువురు కాలనీవాసులు కలెక్టర్‌ను కలిసి డ్రైనేజీ పనులు చేపట్టేలా చూడాలని, రోడ్ల వెడల్పు చేయించాలని, కాలనీలో నూతన రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరగా.. పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శైలజ, ఎంపీడీఓ దివాకర్, రూరల్ తహసీల్దార్ మోహన్ కుమార్, పంచాయతీ సెక్రటరీ సర్దార్‌వలి పాల్గొన్నారు.
పాత రోజులు గుర్తొస్తున్నాయి..
‘జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరంలో విద్యార్థులు పాల్గొనడం హర్షణీయం. నేను కూడా విద్యార్థి దశలో ఎన్‌ఎస్‌ఎస్ నిర్వహించే ప్రత్యేక శిబిరాల్లో పాల్గొని సేవలందించా. మిమ్మల్ని చూడగానే నాకు పాత రోజులు గుర్తుకొస్తున్నాయి’ అని కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. శనివారం కురుగుంట గ్రామంలో ఆర్ట్స్ కళాశాల యూనిట్–2, ఎస్‌ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపకుడు సుంకర రమేష్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ విష్ణుప్రియ, కాలనీ నాయకులు నారాయణస్వామి, కుమార్, రంజిత్ కుమార్ పాల్గొన్నారు.
ఎర్రమట్టి మాఫియాపై పోలీసుల చర్యలు
అనంతపురం: ఎట్టకేలకు ఎర్రమట్టి మాఫియాపై పోలీసులు చర్యలకు ఉప క్రమించారు. బుక్కరాయ సముద్రం మండలం పసలూరు గ్రామంలోని జగనన్న లే అవుట్‌లో అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న ఎర్రమట్టి మాఫియాపై ‘సాక్షి’లో ఇటీవల ‘అమ్మ అభయం.. తమ్ముళ్ల దారుణం’ శీర్షికన కథనం వెలువడింది. శింగనమల నియోజకవర్గ వ్యాప్తంగా యథేచ్ఛగా జరుగుతున్న సహజ వనరుల లూటీని కూలంకుషంగా వివరించడంతో పోలీసు అధికారులు స్పందించారు. బుక్కరాయ సముద్రం మండలంలో 17 ట్రాక్టర్లు, 3 టిప్పర్లు, 3 జేసీబీలు, నాలుగు హిటాచీలను స్వాధీనం చేసుకున్నారు. రూ.2,64,991 జరిమానా విధించారు. అనుమతి లేకుండా ఎర్రమట్టిని తరలిస్తే చర్యలు తప్పవని అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు.


