పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం
అనంతపురం అర్బన్/టౌన్: పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని కృషి చేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ కృష్ణయ్యతో కలిసి సర్కులర్ ఎకానమీ, వేస్ట్ రీసైకిలింగ్ పాలసీపై సిమెంట్ ప్లాంట్లు, స్టీల్ పరిశ్రమలు, టైర్ పైరోలిసిస్ యూనిట్లలో ప్లాస్టిక్ వేస్ట్ రీసైకిలింగ్ యూనిట్ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పారిశ్రామిక వాడల్లో రీసైకిలింగ్‌కు అన్ని చర్యలు చేపట్టామన్నారు. గ్రానైట్ వ్యర్థాలను రీసైకిల్ చేసి విలువ ఆధారిత ఆదాయవనరులుగా మార్చుకోవాలని చెప్పారు. భావితరాలకు కాలుష్యరహిత వాతావరణాన్ని అందించడం లక్ష్యంగా కార్యక్రమాలను కొనసాగించాలన్నారు. కాలుష్య నియంత్రణపై ప్రజలను చైతన్య పరచాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములవ్వాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై ఉక్కుపాదం మోపాలన్నారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారి కిషోర్‌రెడ్డి, ఏఈ కృష్ణారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ శైలజ, పరిశ్రమల శాఖ అధికారి శ్రీనివాసయాదవ్ పాల్గొన్నారు.


