నేత్రపర్వంగా కలశ ప్రతిష్టాపన
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో శుక్రవారం చేపట్టిన కలశ ప్రతిష్ట మహోత్సవం నేత్రపర్వంగా సాగింది. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంతోపాటు, అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి తదితరులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. శుక్రవారం వేకువజామునే ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 11.10 గంటలకు ఆలయ ప్రధాన గోపురంతోపాటు, మిగిలిన నాలుగు రాజ గోపురాలపై రుత్వికుల మంత్రోచ్ఛారణల మధ్య కలశాలను ప్రతిష్టించారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ ఎం.విజయరాజు, ఆలయ అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ, సిబ్బంది పర్యవేక్షించారు.


