పటేల్ సేవలు స్ఫూర్తిదాయకం
అనంతపురం సెంట్రల్: దేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని ఎస్పీ జగదీష్ కొనియాడారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో పోలీసు అమరవీరుల స్థూపం వద్ద జాతీయ ఏక్తా దినోత్సవాన్ని నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించి, మాట్లాడారు. సువిశాల భారతావనిని ఏకతాటిపై నడిపించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. అనంతరం ఐక్యతా పరుగు (రన్ ఫర్ యూనిటీ) కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాజ్ బాషా, అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావు, రూరల్ డీఎస్పీ వెంకటేశులు, ఏఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, సీఐలు ధరణికిశోర్, క్రాంతికుమార్, వెంకటేశ్వర్లు, శ్రీకాంత్‌యాదవ్, రాజేంద్రనాథ్‌యాదవ్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.


