తాడిపత్రి ఏఎస్పీ రోహిత్‌కుమార్ గడువు పెంపు
అనంతపురం సెంట్రల్: తాడిపత్రి ఏఎస్పీగా ఐపీఎస్ అధికారి రోహిత్‌కుమార్ చౌదరిని మరో ఏడాది పాటు కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఏఎస్పీ రోహిత్‌కుమార్ మధ్య కొంతకాలంగా ప్రత్యక్ష పోరు నడుస్తున్న విషయం విదితమే. చట్ట ప్రకారం విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్పీని బదిలీ చేయించేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. తన మాట నెగ్గబోతోందన్న ధీమాతో అమరవీరుల దినోత్సవం రోజున ఏఎస్పీపై జేసీ చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపాయి. అయితే ఇందుకు విరుద్ధంగా ఏఎస్పీ రోహిత్ గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడడంతో జేసీ దూకుడుకు కల్లెం వేసేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్దమైనట్లుగా ఊహాగానాలు చెలరేగాయి.
యాచకురాలిపై అత్యాచారయత్నం?
శింగనమల(నార్పల): మండల కేంద్రం నార్పలలో కూతలేరు బ్రిడ్జి వద్ద నిద్రిస్తున్న ఓ యాచకురాలిపై గుర్తు తెలియని వ్యక్తి సోమవారం అర్ధరాత్రి సమయంలో అత్యాచారయత్నం చేసినట్లు తెలిసింది. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన 50 ఏళ్ల వయస్సున్న మహిళ 20 రోజులుగా నార్పలలోని దుకాణాలు, బస్టాండ్ ప్రాంతంలో భిక్షాటన చేస్తూ రాత్రి సమయంలో కూతలేరు బ్రిడ్జి సమీపంలోని షాపుల ఎదుట నిద్రించేది. సోమవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమైపె ఆత్యాచారయత్నం చేయడంతో గట్టిగా కేకలు వేసింది. దీంతో చుట్టు పక్కల వారు అక్కడకు చేరుకోవడంతో సదరు వ్యక్తి పారిపోయాడు. మంగళవారం ఉదయం సమాచారం తెలుసుకున్న పోలీసులు మహిళా యాచకురాలిని విచారించారు. అనంతరం ఆమెను పోలీసులు ప్రొద్దుటూరులోని కుటుంబసభ్యుల వద్దకు చేర్చారు. దీనిపై ఎస్‌ఐ సాగర్‌ను వివరణ కోరగా... ఘటనపై తాము విచారణ చేశామన్నారు. యాచకురాలిపై అత్యాచారయత్నం జరగలేదన్నారు.
ఫేక్ పత్రాలతో కోర్టుకు వెళ్లారు
అనంతపురం టవర్‌క్లాక్: నగర శివారులోని పాపంపేట స్థలాలకు ఫేక్ పత్రాలు సృష్టించి కోర్టుకు వెళ్లారని బాధితుడు వి.అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. పాపంపేట భూ బాధితులు మంగళవారం అనంతపురంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాపంపేటలో 10 వేల కుటుంబాలు, 30 వేల మంది జనాభా, 18 వేల మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. పాపంపేటలోని 900 ఎకరాలకు సంబంధించి శోత్రియం భూములకు వారసులమంటూ కొందరు వ్యక్తులు ఫేక్ పొజిషన్ సర్టిఫికెట్లతో కోర్టును ఆశ్రయించి, తమను ఇబ్బంది పెడుతున్నారని, అంతేకాక ఖాళీ చేయాలంటూ దౌర్జన్యాలు సాగిస్తున్నారని వాపోయారు. కొన్నేళ్ల క్రితం శోత్రియం భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని, ప్రస్తుతం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వారికి ఎలాంటి హక్కులు లేవని స్పష్టం చేశారు. తమ స్థలాలను కాపాడుకునేందుకు ఐక్య ఉద్యమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు బాధితులు పాల్గొన్నారు.
తాడిపత్రి ఏఎస్పీ రోహిత్‌కుమార్ గడువు పెంపు


