ఆకులేడులో ‘తమ్ముళ్ల’ మట్టి దోపిడీ
● పట్టపగలే జేసీబీ పెట్టి మూడు టిప్పర్లతో తరలింపు
శింగనమల: మండలంలోని ఆకులేడు గ్రామంలో వాటర్‌షెడ్ పనులు జరిగిన ప్రాంతంలో మంగళవారం టీడీపీ కార్యకర్తలు ఎర్రమట్టిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. పట్టపగలే జేసీబీ పెట్టి మూడు టిప్పర్లలో మట్టిని తరలిస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. వారం రోజుల క్రితం ఎర్రమట్టిని తరలించేందుకు ప్రయత్నిస్తే స్థానికులు అడ్డుకున్నారు. దీనిపై తహసీల్దార్ శేషారెడ్డిని వివరణ కోరగా.. ఆకులేడు ప్రాంతంలో ఎర్రమట్టిని తరలించేందుకు ఎవరికీ అనుమతులు ఇవ్వలేదన్నారు. అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
క్రీడా ప్రోత్సాహకాలకు దరఖాస్తు చేసుకోండి
అనంతపురం కార్పొరేషన్: అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులు నగదు ప్రోత్సాహక పథకానికి వచ్చే నెల 4వ తేదీ రాత్రి 11.59 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని డీఎస్‌డీఓ మంజుల పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎస్‌ఏఏపీ కేఆర్‌ఈఈడీఏ (సాప్ క్రీడా) యాప్ లేదా https://sports.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వివరించారు.
266 ఫైళ్లకు పరిష్కారం
అనంతపురం అర్బన్: దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న 22ఏ (నిషేధిత భూముల) జాబితా ఫైళ్ల పరిష్కారంలో భాగంగా కలెక్టర్ ఓ.ఆనంద్ చేపట్టిన రెండో విడత ప్రక్రియలో 266 ఫైళ్లకు పరిష్కారం దక్కింది. గత నెల 26, 27 తేదీల్లో చేపట్టిన తొలి విడత ప్రక్రియలో 191 ఫైళ్లను పరిష్కరించిన విషయం తెలిసిందే. ఈ నెల 25, 26 తేదీల్లో మండలాల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు అందరూ కలెక్టరేట్‌లోనే ఉంటూ ఫైళ్లను పరిశీలించి సిద్ధం చేశారు. అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్లు ఆర్‌డీఓలు నేతృత్వంలో సాగిన ఈ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ, డీఆర్‌ఓ ఎ.మలోల పర్యవేక్షించారు. అధికారులు సమర్పించిన 266 ఫైళ్లల్లో ప్రభుత్వ నిబంధన ప్రకారం ఉన్న 108 ఫైళ్లను కలెక్టర్ ఆమోదించారు. నిబంధనకు విరుద్ధంగా ఉన్న 158 ఫైళ్లను తిరస్కరించారు. చుక్కల భూముల దరఖాస్తులపై డీఎల్‌సీ (డాటెడ్ ల్యాండ్ కమిటీ) సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
ఆకులేడులో ‘తమ్ముళ్ల’ మట్టి దోపిడీ


