దళితురాలనే హోటల్‌ను కూలదోశారు
● లంచం తీసుకుని కమిషనర్ ద్రోహం చేశారు
● బాధితురాలు దివ్య
కళ్యాణదుర్గం: కేవలం తాను దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళను కావడంతోనే టీడీపీ నేతల ఒత్తిళ్లతో తన హోటల్‌ను మున్సిపల్ అధికారులు కూలదోశారంటూ బాధితురాలు దివ్య ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం హోటల్ తొలగించిన స్థానంలో ఎస్సీ, ఎస్టీ జేఏసీ తాలూకా అధ్యక్షుడు చెలిమప్పతో కలసి ఆమె మీడియాతో మాట్లాడారు. తాను 30 ఏళ్లుగా ఆర్‌అండ్‌బీ స్థలం పక్కనే చిన్న హోటల్ పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నానన్నారు. ఇందుకు సంబంధించి మున్సిపాలిటీకి నీటి పన్ను, ఇంటి పన్నుతో పాటు విద్యుత్ బిల్లులు సక్రమంగా చెల్లిస్తున్నానన్నారు. తన హోటల్ వెనుక ఉన్న కానిస్టేబుల్ నరసింహులతో మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ రూ.1.50 లక్షలు లంచం తీసుకుని అన్యాయంగా తన హోటల్‌ను తొలగించారని ఆరోపించారు. తన హోటల్ పక్కనే ఆర్‌అండ్‌బీ స్థలంలో నిర్వహిస్తున్న హోటళ్ల జోలికి వెళ్లకుండా కేవలం వైఎస్సార్‌సీపీ సానుభూతిపరురాలైన తన హోటల్‌ను మాత్రమే కూలదోశారంటూ వాపోయారు. తనకు జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. కమిషనర్ మూడు రోజుల్లోపు ఆర్‌అండ్‌బీ స్థలంలో ఉన్న వాటిని తొలగిస్తానని చెప్పారని తొలగించని పక్షంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతానని పేర్కొన్నారు.


