ఇబ్బంది పెట్టే ఎవరినీ వదలం
బుక్కరాయసముద్రం: అధికారాన్ని అడ్డుపెట్టుకుని సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే ఎవరినీ ఉపేక్షించబోమని శింగనమల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ హెచ్చరించారు. చంద్రబాబునాయుడు తలకిందులా తపస్సు చేసినా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీనే అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. పాత్రికేయుడిపై ఎర్రమట్టి మాఫియా దాడిని ఖండిస్తూ సోమవారం బీకేఎస్ మండలం పసులూరు గ్రామంలో బాధిత విలేకరి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ‘కాళ్లు పట్టుకుంటామని... ఇకపై మీ వార్తలు రాయడని’ చెప్పినా వినకుండా ఇంటి మీదకు వచ్చి మహిళలని చూడకుండా చెప్పలేని పదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారంటూ విలేకరి పెద్దన్న భార్య రత్నమ్మ కన్నీరు పెట్టుకున్నారు. దళితులనే కారణంతోనే టీడీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. శైలజనాథ్ మాట్లాడుతూ.. అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అంటూ టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా పద్దతి మార్చుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. బాధిత పెద్దన్న కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం జగనన్న లే అవుట్‌లో ఎర్రమట్టి తవ్వకాలను పరిశీలించారు. కాలనీ మొత్తాన్ని తవ్వేడాన్ని గమనించి అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఇంతటి దుర్మార్గాన్ని గతంలో ఎన్నడూ చూడలేదన్నారు.
చర్యలు తీసుకోండి
విలేకరి పెద్దన్నపై దాడి చేసిన ఎర్రమట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు గువ్వల శ్రీకాంతరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం ఎస్‌ఐ రాంప్రసాద్‌కు ఫిర్యాదు ప్రతిని అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ భాస్కర్, నాయకులు అంజి, జయరామిరెడ్డి, నరేష్, వరికూటి కాటమయ్య, బయపరెడ్డి, సూర్యనారాయణరెడ్డి, చిన్నపరెడ్డి, పద్మావతి, నిమ్మల భాస్కర్, శివారెడ్డి, కొండ, రామాంజనేయులు, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
కూటమి నాయకులపై మాజీ మంత్రి శైలజనాథ్ ఆగ్రహం


