జర్మనీలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి
అనంతపురం రూరల్: జర్మనీలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగాల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మైనార్టీ కార్పొరేషన్ ఈడీ జగన్‌మోహన్‌రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ముస్లిం, మైనార్టీ, క్రిస్టియన్, సిక్కులు, బౌద్ధులు, పార్శీలు, జైన్ మతాలలో అర్హులైన వారు httpr;//naipunyam. ap.gov.in/urer వెబ్ సైట్ ద్వారా నవంబర్ 2లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఐటీఐలో రెండు సంవత్సరాలు, లేదా డిప్లొమాలో ఎలక్ట్రీషియన్ పూర్తి చేసి ఉండాలన్నారు. 30 సంవత్సరాల లోపు వయసు ఉండాలన్నారు. ఆధార్, పాస్‌పోర్డు కలిగి ఉండాలన్నారు. మరిన్ని వివరాల కోసం 99888 53335, 87126 55686, 87901 17279, 87901 18349 నంబర్లలో సంప్రదించాలన్నారు.
అరటి ఎగుమతులను ప్రోత్సహించాలి
అనంతపురం అగ్రికల్చర్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26)లో ఉద్యాన పథకాల అమలును వేగవంతం చేయాలని ఉద్యానశాఖ డీడీ డి.ఉమాదేవి ఆదేశించారు. శనివారం స్థానిక ఉద్యానశాఖ కార్యాలయంలో ఏపీఎంఐపీ పీడీ బి.రఘునాథరెడ్డి, ఏడీ దేవానంద్‌కుమార్‌తో కలిసి హార్టికల్చర్ ఆఫీసర్స్ (హెచ్‌వో)తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంఐడీహెచ్, ఆర్‌కేవీవై, ఆయిల్‌పామ్, బ్యాంబూమిషన్ కార్యక్రమాల కింద వివిధ పథకాల అమలుకు రూ.12.86 కోట్లు బడ్జెట్ ఉన్నందున వాటి ప్రోత్సాహక రాయితీలు పూర్తి స్థాయిలో రైతులకు అందించే బాధ్యత హెచ్‌వోలదే అన్నారు. గడవు సమీపిస్తున్నందున ఈ–క్రాప్ నమోదు పూర్తి చేయాలన్నారు. నాణ్యమైన అరటి పండించేలా రైతులకు మేలైన యాజమాన్య పద్ధతులు తెలియజేయాలని, ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు అరటి ఎగుమతులు జరిగేలా ప్రోత్సహించాలని సూచించారు.
యువకుడి ఆత్మహత్య
గుత్తి: పట్టణంలోని చెర్లోపల్లి కాలనీకి చెందిన కృష్ణ కుమారుడు నవీన్ (27) శనివారం రాత్రి లచ్చానపల్లి బ్రిడ్జి సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న జీఆర్‌పీ కానిస్టేబుల్ నాగరాజు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
మహిళపై అత్యాచారయత్నం
పుట్లూరు: మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై రాజకుళ్లాయప్ప అనే వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.
లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు
అనంతపురం మెడికల్: లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ డాక్టర్ భ్రమరాంబదేవి హెచ్చరించారు. శనివారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో పీసీపీఎన్‌డీటీ యాక్ట్ అమలుపై జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశం జరిగింది. చట్టాన్ని ఉల్లంఘించిన స్కాన్ సెంటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా బాల్య వివాహాలు, టీనేజీ ప్రెగ్నెన్సీ ద్వారా ఎదురయ్యే దుష్పరిణామాలను ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో సర్వజనాస్పత్రి చిన్నపిల్లల విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ రవికుమార్, గైనకాలజిస్టు డాక్టర్ ఇందిరా ప్రియదర్శిని, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ శ్రీనివాసులురెడ్డి, డాక్టర్ దివ్య, డాక్టర్ దుర్గేష్, డాక్టర్ నారాయణస్వామి, డెమో నాగరాజు పాల్గొన్నారు.
మాతా శిశు మరణాల నివారణకు కృషి
మాతా శిశు మరణాల నివారణకు కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో మాతా, శిశు మరణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గత నెలలో జరిగిన ఒక మాతృ, 6 శిశు మరణాలపై సమీక్ష నిర్వహించారు.


