హోటల్‌ తొలగింపులో ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

హోటల్‌ తొలగింపులో ఉద్రిక్తత

Oct 26 2025 8:45 AM | Updated on Oct 26 2025 8:45 AM

హోటల్‌ తొలగింపులో ఉద్రిక్తత

హోటల్‌ తొలగింపులో ఉద్రిక్తత

అడ్డుకోబోయిన బాధితులు, సీపీఐ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నేతల అరెస్ట్‌

కళ్యాణదుర్గం: దళిత సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల హోటల్‌ షెడ్డు తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. పట్టణంలో మున్సిపల్‌, ఆర్‌అండ్‌బీ స్థలాలు ఆక్రమించి పెద్ద పెద్ద భవంతులు నిర్మించినా పట్టించుకోని అధికారులు.. చిన్న విస్తీర్ణంలో ఏర్పాటు చేసుకున్న హోటల్‌ను ఉద్దేశపూర్వకంగా జేసీబీ సాయంతో తొలగించడం విమర్శలకు తావిచ్చింది. ఆర్డీటీ ఆస్పత్రికి ఎదురుగా రోడ్డుకు ఆనుకుని ఉన్న సర్వే నం.357 లోని రెండు సెంట్ల ఆర్‌అండ్‌బీ స్థలంలో రామచంద్ర, దివ్య దంపతులు షెడ్డు వేసుకుని, అందులో హోటల్‌ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. 30 ఏళ్లుగా ఈ హోటలే వారికి జీవనాధారంగా ఉంటోంది. వీరు వైఎస్సార్‌సీపీలో కొనసాగుతున్నారు. ఈ హోటల్‌ వెనుక జి.నరసింహులు అనే కానిస్టేబుల్‌కు సర్వే నంబర్‌ 359–1లోని రెండున్నర సెంట్ల స్థలం ఉంది. అయితే తన స్థలం పరిధిలోనే దివ్య హోటల్‌ నడుపుతున్నారంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదే అదనుగా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో అధికార పార్టీ నేతలు కుట్రపన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చారు. ఈ క్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ వంశీకృష్ణ భార్గవ్‌ పోలీసు బందోబస్తు నడుమ శనివారం జేసీబీ ద్వారా హోటల్‌–బంక్‌ తొలగింపునకు చర్యలు చేపట్టారు. తామే తొలగించుకుంటామని, గడువు ఇవ్వాలని ప్రాధేయపడిన నిర్వాహకుల విజ్ఞప్తిని పట్టించుకోకుండా వారిని పక్కకు లాగేసి మరీ.. హోటల్‌లోని సరుకులను కార్మికుల చేత పక్కకు తీయించేశారు. అటు ఇటు ఉన్న దుకాణాలను వదిలేసి తమ హోటల్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని తొలగించడాన్ని దివ్య, రామచంద్ర తప్పు పట్టారు. పొట్టకూటి కోసం పేదలు ఏర్పాటు చేసుకున్న చిరు హోటళ్లు, బంకులను తొలగించరాదంటూ సీపీఐ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో హోటల్‌ నిర్వాహకులతో పాటు సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్‌, పట్టణ కార్యదర్శి ఓంకార్‌, బుడేన్‌, ఎస్సీ,ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరితో పాటు పలువురిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పట్టణంలో చాలాచోట్ల మున్సిపల్‌, ఆర్‌అండ్‌బీ స్థలాలను కబ్జా చేసి భవంతులు నిర్మిస్తున్నా మున్సిపల్‌ కమిషనర్‌కు అవేవీ కనిపించడం లేదని, పేదలు జీవనోపాధి కోసం ఏర్పాటు చేసుకున్న వాటిని కక్ష కట్టినట్టు తొలగించడంలో ఆంతర్యం ఏమిటని ఆందోళనకారులు ప్రశ్నించారు. ముమ్మాటికీ అగ్రకులాల వారి కుట్రేనని ఆరోపించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. అనంతరం డీఎస్పీ రవిబాబు, సీఐలు వంశీధర్‌, హరినాథ్‌తో పాటు పదుల సంఖ్యలో పోలీసులు మోహరించి, అందరినీ పంపించేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement