ఎన్‌పీఏ తగ్గింపుపై దృష్టి సారించాలి
అనంతపురం అగ్రికల్చర్: సహకార బ్యాంకులు ఆర్థిక పురోగతి సాధించాలంటే నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) తగ్గించుకోవడంపై దృష్టి సారించాలని రాష్ట్ర సహకార బ్యాంకు (ఆప్కాబ్) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) శ్రీనాథ్‌రెడ్డి ఆదేశించారు. వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లా సహకార ఉద్యోగులకు స్థానిక ఆర్డీటీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ శనివారం ముగిసింది. ఈ సందర్భగా హాజరైన ఎండీ మాట్లాడుతూ గడువు మీరిన మొండిబకాయిలు వసూళ్లు బాగా పెరగాలన్నారు. పరిస్థితులకు అనుగుణంగా బంగారు నగల తాకట్టు రుణాలు బాగా పెంచాలన్నారు. పరపతితో పాటు పరపతేతర వ్యాపార ప్రణాళికలతో బ్యాంకులను ఆర్థికంగా లాభాలబాట పట్టించడానికి పాలకవర్గం, అధికార సిబ్బంది కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, సీఈఓ కె.సురేఖారాణి, డీజీఎంలు రామ్‌ప్రసాద్, విజయచంద్రారెడ్డి, సుఖదేవబాబు, లక్నో నుంచి వచ్చిన ట్రైనర్ శిఖా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.
‘ లా ’కోర్సులకు పెరుగుతున్న డిమాండ్
అనంతపురం : న్యాయశాస్త్ర కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. న్యాయవాది వృత్తిపట్ల యువతకు పెరుగుతున్న ఆదరణే ఇందుకు నిదర్శనం. న్యాయవాద కోర్సులకు సంబంధించి ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో సీట్ల కేటాయింపు పూర్తయింది. శనివారం జాబితా విడుదలైంది. ఎస్కేయూ క్యాంపస్‌లోని న్యాయశాస్త్ర విభాగంలో ఎల్‌ఎల్‌బీ (మూడు సంవత్సరాలు) 66 సీట్లకు గాను అన్ని సీట్లూ భర్తీ అయ్యాయి. ఎస్కేయూ అనుబంధ విజయనగర లా కళాశాలలోనూ కన్వీనర్ కోటాలోని 80 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. 80 శాతం సీట్లు పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులకే దక్కాయి. మేనేజ్‌మెంట్ కోటా సీట్లు 20 శాతం స్థానికులకు, స్థానికేతరులతోనూ భర్తీ చేసుకోవచ్చు. లీగల్ ప్రొఫెషనల్‌కు మంచి డిమాండ్ ఉంది. సీట్లు పొందిన విద్యార్థులు సోమవారం ఆయా కళాశాలల్లో రిపోర్ట్ చేసుకోవాల్సి ఉంది.


