కూడేరు: పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) నాలుగో గేటును శనివారం తాత్కాలికంగా ఎత్తి దిగువన ఉన్న మిడ్‌పెన్నార్ (ఎంపీఆర్)కు నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ ఎస్‌ఈ సుధాకర్‌రావు మాట్లాడుతూ డ్యాంలో నీటి మట్టం 5.443 టీఎంసీలు ఉందన్నారు. తుంగభద్ర డ్యాం నుంచి హెచ్చెల్సీ ద్వారా పీఏబీఆర్‌లోకి 150 క్యూసెక్కులు, హంద్రీ–నీవా కాలువ ద్వారా జీడిపల్లి జలాశయం నుంచి 400 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందన్నారు. అదే విధంగా తాగునీటి ప్రాజెక్టులకు, నీటి ఆవిరి, లీకేజీల రూపంలో 220 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉందన్నారు. పది రోజుల క్రితం వరకు డ్యాం వద్ద ఏర్పాటైన ఏపీ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి 550–870 క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేస్తూ వచ్చామన్నారు. దీంతో ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో ఇంచుమించు సమానంగా ఉండేదన్నారు. కానీ జల విద్యుత్ ఉత్పత్తికి నీటిని విడుదల చేసే ప్రాంతంలో ఏర్పాటు చేసిన గేట్ లింక్ పని చేయకపోవడంతో గేటు పైకి లేవకపోవడంతో నీరు సరఫరా కాలేదన్నారు. దీంతో జలవిద్యుత్ ఉత్పత్తి ఆగిపోయిందన్నారు. దీంతో అవుట్‌ఫ్లో కంటే ఇన్‌ఫ్లో ఎక్కువ ఉండడంతో నీటి మట్టం 5.5 టీఎంసీల దాటిపోయే పరిస్థితి ఉందన్నారు. అలా జరిగితే డ్యాం దిగువన ఉన్న భూములు నీటి ముంపునకు గురయ్యే ప్రమాదముందన్నారు. డ్యాం నీటి నిల్వ సామర్‌ాధ్యన్ని దృష్టిలో ఉంచుకొని తాత్కాలికంగా ఒక గేటును ఎత్తి 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశామన్నారు. గేటు మరమ్మతు పనులు పూర్తిగానే గేటు దించి జల విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించేందుకు చర్యలు చేపడతామని ఎస్‌ఈ వెల్లడించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎస్‌ఈ పెంచలయ్య, డీఈఈ వెంకటరమణ, ఏఈఈలు ముత్యాలప్ప, లక్ష్మీదేవి, గంగమ్మ, రేణుక, లింగయ్య, పరమేష్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


