వైద్య కళాశాలకు మరో 15 పీజీ సీట్లు | - | Sakshi
Sakshi News home page

వైద్య కళాశాలకు మరో 15 పీజీ సీట్లు

Oct 18 2025 7:07 AM | Updated on Oct 18 2025 7:19 AM

అనంతపురం కార్పొరేషన్‌: అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలకు మరో 15 పీజీ సీట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది వరకే పీజీ సీట్లు ఉన్న అనస్తీషియాకు 4, ఆబ్‌స్ట్రిక్స్‌, గైనకాలజీ 4, పీడియాట్రిక్స్‌ విభాగానికి 4 పీజీ సీట్లు మంజూరయ్యాయి. అలాగే కొత్తగా హాస్పిటల్‌ అడ్మిని స్ట్రేషన్‌ విభాగానికి 3 పీజీ సీట్లు వచ్చాయి.

ప్రతి విద్యార్థీ

కౌశల్‌ క్విజ్‌లో పాల్గొనాలి

అనంతపురం సిటీ: జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో నిర్వహించే కౌశల్‌ క్విజ్‌లో విద్యార్థులందరూ పాల్గొనేలా చూడాలని జిల్లా విద్యా శాఖాధికారి ప్రసాద్‌బాబు ఆదేశించారు. కౌశల్‌ క్విజ్‌–2025కు సంబంధించి రూపొందించిన పోస్టర్లను అనంతపురంలోని సైన్స్‌ సెంటర్‌లో శుక్రవారం ఆవిష్కరించారు. శనివారం నిర్వహించనున్న పాఠశాల కాంప్లెక్స్‌ సమావేశాల్లో కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు తమ పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో కౌశల్‌ క్విజ్‌లో పాల్గొనే విద్యార్థుల పేర్లను నమోదు చేయాలని సూచించారు. జిల్లా సైన్స్‌ అధికారి బాలమురళీకృష్ణ, కౌశల్‌ జిల్లా సమన్వయకర్త ఆనంద భాస్కర్‌రెడ్డి, డీఈఓ కార్యాలయ ఏడీ శ్రీనివాసులు, ఏఎస్‌ఓ శ్రీనివాసులు, ఎస్టీయూ ప్రతినిధులు చంద్రశేఖర్‌రెడ్డి, రామాంజనేయులు పాల్గొన్నారు.

అక్రమంగా టపాసులు

విక్రయిస్తే చర్యలు

అనంతపురం సెంట్రల్‌: జిల్లాలో అక్రమంగా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జగదీష్‌ హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. లైసెన్స్‌ కలిగిన దుకాణాదారులు మాత్రమే టపాసులు విక్రయించాలని స్పష్టం చేశారు. అనధికారికంగా ఎవ్వరైనా విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తాత్కాలిక లైసెన్స్‌దారులు జిల్లా యంత్రాంగం సూచించిన ప్రదేశాల్లో మాత్రమే నిర్ణీత కొలతల మేరకు ప్రత్యేక షెడ్లలో దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నీరు, ఇసుక, ఇతర అగ్నిమాపక సామగ్రిని తప్పనిసరిగా టపాసుల విక్రయ దుకాణాల్లో సిద్దంగా ఉంచుకోవాలన్నారు. 18 సంవత్సరాల లోపు పిల్లలను విక్రయ పనుల్లో ఉంచుకోరాదని తెలిపారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకొని దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. పెద్దల పర్యవేక్షణలోనే పిల్లలు టపాసులు కాల్చేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సరదాకు కూడా చేతిలో పట్టుకొని కాల్చకూడదని, అగ్నిప్రమాదం సంభవించే ప్రదేశాల్లో టపాసులు ఉంచరాదని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా ప్రమాదాలు జరిగినా, అక్రమంగా టపాసులు విక్రయిస్తున్నా వెంటనే డయల్‌ 100, 112కు సమాచారం అందించాలని కోరారు.

అత్యాచారం కేసులో

పదేళ్ల జైలు

ఆత్మకూరు: వృద్ధురాలిపై అత్యాచారం చేసిన కేసులో ముద్దాయికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ అనంతపురం నాల్గవ సెషన్స్‌ కోర్టు జడ్జి తీర్పు చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆత్మకూరు ఎస్‌ఐ లక్ష్మణరావు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. మదిగుబ్బ గ్రామానికి చెందిన పెద్దన్న అనే వ్యక్తి 2018లో మండల పరిధిలోని ఒక గ్రామంలో ఇంటి ముందు నిద్రిస్తున్న వృద్ధురాలిపై అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఈ కేసులో 15 మంది సాక్షులను విచారించిన అనంతరం ముద్దాయి పెద్దన్నపై నేరం రుజువు కావడంతో పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ అనంతపురం నాల్గవ సెషన్స్‌ కోర్టు జడ్జి శుక్రవారం తీర్పు చెప్పారు.

వైద్య కళాశాలకు మరో 15 పీజీ సీట్లు 1
1/2

వైద్య కళాశాలకు మరో 15 పీజీ సీట్లు

వైద్య కళాశాలకు మరో 15 పీజీ సీట్లు 2
2/2

వైద్య కళాశాలకు మరో 15 పీజీ సీట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement